
వసుంధర
‘బస్తీ పార్లమెంట్’... బస్తీ సమస్యలపై పిల్లల ఆధ్వర్యంలో జరిగే చర్చావేదిక ఇది. అలాగని ఇదేదో పిల్ల వ్యవహారం అనుకోవద్దు. ఇక్కడ ప్రధానిగా ఎంపికైన వాళ్లు సమస్యలపై పోరాడాలి... పరిష్కారాలు సాధించాలి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న అరిపెన జయలక్ష్మి ఏం సాధించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..
‘‘అమ్మానాన్నలు పొద్దునే కూలికి వెళ్లిపోతే... స్కూల్లో మధ్యాహ్నానికిగానీ అన్నం పెట్టరు. అంత వరకూ ఆకలితో ఉండాల్సిందే. ఆలోపు తినేందుకు ఏమైనా ఉంటే బాగుంటుంది కదా’ అని ఓ చిన్నారి బాధపడింది. తక్కిన పిల్లలూ ఆమెతో గొంతు కలిపారు. అదే విషయంపై ఓ తీర్మానం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ ప్రధానమంత్రిగా ఉన్న జయలక్ష్మి ఈ విషయాన్ని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు వివరించింది. చిన్నారుల ఆకలి బాధకు స్పందించి 56 బస్తీల్లో ఉన్న అంగన్వాడీలలో ఉదయం అల్పాహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 21 బస్తీల్లోనూ దీన్ని ప్రారంబించనున్నారు. ఏడేళ్ల కిందట మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ 56 బస్తీల్లో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే చిల్డ్రన్ పార్లమెంట్ నిర్వహిస్తోంది. 6 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలను భాగస్వాములుగా చేసి వారి సమస్యలపై వారే చర్చించుకుని పరిష్కార మార్గాలు అన్వేషించేలా తీర్చిదిద్దింది. ఇందులో భాగమే పార్లమెంట్, ప్రధానమంత్రి. ఇక్కడి సమస్యలపై బాగా అవగాహన, చురుకుదనం ఉన్న జయలక్ష్మి ప్రధానిగా ఎన్నికయ్యింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది తను. తన గురించి, తను చేస్తోన్న పనుల గురించి ఉత్సాహంగా చెప్పుకొచ్చిందీ అమ్మాయి. ‘‘మేం సింగరేణి కాలనీలో ఉంటాం. అమ్మానాన్నలు ఉష, రామ్మోహన్ ఇరవైయేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని నగరానికి వలస వచ్చారు. చెత్త సేకరించే వారు. ప్రస్తుతం స్వచ్ఛ ఆటో నడిపిస్తున్నారు. వాళ్లకు సాయం చేస్తూనే చదువుకుంటున్నా. ఉదయం 4 నుంచి 8 వరకు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తా. తర్వాత కాలేజీకి వెళ్తా. సాయంత్రం వచ్చాక ఎంఎస్ఐ తరఫున బస్తీలో 35-40 మంది విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతా. నాలుగేళ్ల కిందట మాంట్‌ఫోర్ట్ సోషల్ సంస్థతో నా ప్రయాణం మొదలైంది. అప్పట్లో ఓ అక్క సంస్థ తరఫున వచ్చి మా కాలనీలో ట్యూషన్ చెప్పేది. సామాజిక సమస్యలపై నేను స్పందిస్తున్న తీరును చూసి నన్ను సంస్థకు పరిచయం చేసింది. నేను తొమ్మిదో తరగతి చదువుకునేప్పుడు హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యా. ఇదేమంత తేలిక కాదు. ప్రతి బస్తీ నుంచీ ఓటింగ్ జరుగుతుంది. బస్తీ ప్రతినిధులందరూ కలసి ప్రధానిని ఎన్నుకుంటారు. సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్న వారినే ఎన్నుకుంటారు. మా పార్లమెంట్లో స్పీకర్, ఉపప్రధాని, హోంమంత్రి.. ఇలా అన్ని పదవులూ ఉంటాయి. మేమంతా కలిసి ఐరాస నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన, స్థానిక సమస్యలపైన చర్చిస్తాం. గతంలో డ్రైనేజీతో మేం పడుతున్న ఇబ్బందుల గురించి జలమండలి ఎండీ దానకిశోర్ దృష్టికి తీసుకెళ్లా. ఆయన స్పందించి కాల్వలు బాగు చేయించడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు. మురుగు సమస్య, అంగన్వాడీలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా, తెల్లరేషను కార్డులు, ఇళ్లు.. అనేక సమస్యలను చిల్డ్రన్ పార్లమెంట్లో చర్చించి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకున్నాం. మా బస్తీలో ఇటీవల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపింది. దీనిపై పిల్లలతో పార్లమెంట్ నిర్వహించి పరిస్థితులలో మార్పు తీసుకు రావాలనుకున్నాం. మద్యపానం, అమ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. త్వరలో హైదరాబాద్ స్థాయి పార్లమెంట్‌లోనూ చర్చిస్తాం. ప్రస్తుతం సంస్థ తరఫున నెలకు రూ.2వేలు ఉపకారవేతనం ఇస్తున్నారు. వాటితోనే చదువు కొనసాగిస్తున్నా. ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది జయలక్ష్మి.
- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్