
వసుంధర
మంచి ఉద్యోగమంటే నమ్మి ఊరుదాటిందో మహిళ. ప్రేమించానంటే.. నమ్మి వెంట వెళ్లిందింకో అమ్మాయి. మంచి తిండి, బట్టలిస్తారనన్న నాన్న మాట విని తెలియని వ్యక్తి వెనుక నడిచిందో చిన్నారి.. వేశ్యాగృహాల నుంచి తాను రక్షించిన అమ్మాయిల నోట ఇలాంటి దయనీయ కథలెన్నో వింది పల్లవీ ఘోష్. ఆ నరకకూపాల నుంచి 5వేలకు పైగా మందిని రక్షించిన ఈమె.. వాళ్లని ఈ ఉచ్చులోకి రాకుండా చేయడమే ప్రధానమని భావించింది. ఆ దిశగా తన ఒంటరి పోరాటాన్ని వసుంధరతో పంచుకుందిలా...!
మాది అసోం. దిల్లీలో స్థిరపడ్డా. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ, జెండర్ స్టడీస్‌లో పీజీ చేశా. ఇంటర్లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ టీచర్. నన్నూ, చెల్లిని ఆమే పెంచింది. ఈశాన్య రాష్ట్రాల్లో లింగభేదం పెద్దగా కనిపించదు. ఓసారి వేశ్యాగృహాల అమ్మాయిల కథలను చదివా. డబ్బుకోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారంటే గుండెల్ని పిండేసినట్టయింది. అసలా అవమానాన్ని రోజూ ఎలా భరిస్తున్నారో తెలుసుకోవాలనిపించింది. ఓ ఎన్జీఓలో రిసెర్చ్ ఆఫీసర్‌గా చేరా. ఎంతోమందితో మాట్లాడా. ఒక్కొక్కరిదీ ఒక్కో భయానక అనుభవం. ఎత్తుకు రావడం, నమ్మి మోసపోవడం, ఇంట్లో వాళ్లే అమ్మేయడం వంటి కారణాలతో ఈ నరకకూపంలోకి అడుగుపెట్టిన వారే ఎక్కువ. వీళ్లకి సాయం అందించాలనుకున్నా. నా ఆలోచనను అమ్మా, చెల్లి ప్రోత్సహించారు. మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఇప్పుడు ఆయనా నాకు అండగా నిలుస్తున్నారు.
మొదట కొన్ని ఎన్జీఓలతో కలిసి పనిచేశా. అమ్మాయిల ట్రాఫికింగ్ గురించి సమాచారమందితే అధికారులు, పోలీసుల సాయంతో రైడ్లు చేయించి, వాళ్లని రక్షించేదాన్ని. స్టేట్మెంట్ తీసుకున్నాక వీళ్లని పునరావాస కేంద్రాలకు పంపుతారు. కుటుంబసభ్యులు ఆధారాలు చూపిస్తే వాళ్లకి అప్పగిస్తారు. ఇదంతా మామూలే కానీ వాళ్లను ఈ స్థితికి తీసుకువచ్చిన వారికి శిక్ష పడే విషయంలోనే ఆలస్యమవుతోంది. అది చూసినపుడు పట్టరాని బాధ, ఆవేదన కలిగేవి. పైగా స్టేట్మెంట్, సమన్లు పేరిట బాధితులే ప్రశ్నలు ఎదుర్కోవాలి... సమాజమూ చిన్నచూపు చూస్తోంది. తప్పు చేసింది వీళ్లు కాకపోయినా, బాధితులే ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తే బాధనిపించేది. మోసపోతున్న వారిలో పశ్చిమ్‌బంగ, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, అసోంల వారే ఎక్కువ. వీటిల్లోనూ వరద ప్రభావిత ప్రాంతాల వాళ్లు అధికంగా ఉంటున్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాలు, ఆదాయం కోల్పోవడంతో ఇలా మోసపోయిన వారి సంఖ్య పెరిగింది. రెడ్‌లైట్ ఏరియా అనగానే దిల్లీ, ముంబయిలే అనుకుంటారు. కానీ అన్ని ప్రధాన నగరాల్లో ఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఇరుక్కున్న వారిని కాపాడటం కన్నా అసలు ఇందులోకి రాకుండా అడ్డుకోవడం ముఖ్యమనుకున్నా. ‘డైలాగ్ అండ్ ఇంపాక్ట్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. సొంత డబ్బుతోనే నిర్వహిస్తున్నా. దేశవ్యాప్తంగా ఈ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. మహిళా సాధికారత దిశగానూ ప్రయత్నిస్తున్నా. ఓ అమ్మాయితో మాట్లాడినప్పుడు సొంత కుటుంబసభ్యులే తనని అమ్మేసినట్లు చెప్పింది. పేదరికమే కారణం. తినడానికి తిండి లేనప్పుడు చేసేపనిలో తప్పు ఒప్పు అని నిర్ణయించుకొనే అవకాశం ఎక్కడుంటుంది. అందుకే వీటిని ప్రజలే కాదు... పాలకుల దృష్టికీ తీసుకెళుతున్నా. నా ఎన్జీఓ ద్వారా కళాశాల, స్కూళ్లతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.
ఈ తొమ్మిదేళ్లలో 5వేల మంది అమ్మాయిలను కాపాడగలిగా. ప్రతిసారీ రైడ్ అయ్యాక ఇలాంటివి ఆపేయమనీ, చంపుతామనీ బెదిరింపులొస్తుంటాయి. కొంతమంది ప్రాణానికే హాని ఈ పని ఎందుకు అని సలహాలూ ఇస్తుంటారు. కానీ ఆ ఆడపిల్లలను రక్షించినప్పుడు వారి మొహంలో కనిపించే చిరునవ్వు ముందు ఇవేమీ నాకు పెద్ద విషయాలుగా అనిపించవు. ఆ రాత్రి హాయిగా నిద్రపోతా. ఓ బాలికను ఏడేళ్ల తర్వాత తండ్రి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు వారిద్దరూ కౌగిలించుకొని కన్నీరుమున్నీరవుతోంటే చూసి నాకూ దుఖం వచ్చింది. ఇవిచ్చే సంతృప్తి ఇంకేదీ ఇవ్వదనిపిస్తుంది.
- చల్లా విజయభాస్కర్, దిల్లీ