
వసుంధర
అమ్మాయిల విషయంలో.. ‘కూర్చొని చేసే ఉద్యోగాలే మేలు’, ‘ఈ పనులు వాళ్లు చేయలేరు’ లాంటి మాటలకు క్రమంగా చెల్లు చీటి పడుతోంది. అబ్బాయిలకే పరిమితం అనుకునే వాటిల్లోనూ నవతరం అమ్మాయిలు సత్తా చూపుతున్నారు. ఇప్పుడు ఎన్నో సంస్థలు మనకు కొత్త రంగాల్లో ఆ అవకాశాలను కల్పిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవీ..
* సరకుల నుంచి ప్రతిదానికీ ఈకామర్స్ వెబ్సైట్లపై ఆధారపడటం మామూలైంది. వాటితోపాటు ఎవరు గుర్తొస్తారు? ‘డెలివరీ బాయ్స్’ కదా! ఇక నుంచి పిలుపులో మార్పు రానుంది. వాతావరణం, దూరాలతో సంబంధం లేకుండా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మగవాళ్లకే ప్రాధాన్యం ఎక్కువ. కానీ అమ్మాయిలూ తీసిపోరని నమ్ముతోంది అమె జాన్. మహిళలతో ప్రత్యేకంగా డెలివరీ స్టేషన్‌న్లను ప్రారంభిస్తోంది. తమిళనాడు, గుజరాత్‌ల్లో ఒకటి, కేరళలో రెండు చొప్పున మొత్తం నాలుగు ‘ఆల్ విమెన్ పార్ట్నర్ డెలివరీ స్టేషన్లను’ ఇదివరకే ప్రారంభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అయిదో డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించింది. లాజిస్టిక్ రంగంలో అమ్మాయిల ప్రాధాన్యాన్ని పెంచడంతోపాటు వాళ్ల పరిధులను విస్తరించే ఉద్దేశంతోనే వీటిని మొదలుపెట్టినట్లు ఈ సంస్థ చెబుతోంది.
* కొత్త ఇల్లు, పండుగ, వేడుక ఏదైనా ఇంటిని మెరిపించడంపైనే దృష్టి. ఈ అవకాశాన్ని మహిళలకిచ్చింది నిపాన్. ఇప్పుడు తమిళనాడులోని మైలాడుదురై మహిళలు భవనాలకు పెయింటింగ్ వేస్తూ.. ఇందులోనూ మేం తీసిపోమని నిరూపిస్తున్నారు. వీరే కాదు.. దేశవ్యాప్తంగా మహిళలకు ఈ రంగంలో అవకాశాలిస్తానంటోంది నిపాన్. ఇప్పటికే ఈ సంస్థ ఓచేరి, రామసామిపట్టి, అన్నామలై తదితర ప్రాంతాలకు చెందిన 500మందిని ఎంపిక చేసి పెయింటింగ్‌లో రెండువారాల శిక్షణనిచ్చి ఉద్యోగాలనూ కల్పించింది.
* ఉదయం నుంచి ప్రతి పనీ నీటితో ముడిపడిందే! కాబట్టి, ఆ నీటి పంపులు, ట్యాప్‌ల గురించి మహిళలకు తప్ప ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఇదే ఆలోచించింది కోయంబత్తూరుకు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ అనే తయారీ సంస్థ. ‘మహిళా మిషన్ 20 ప్రాజెక్ట్’ పేరుతో తయారీ విభాగంలో ఆడవాళ్లకు అవకాశమిస్తే విజయవంతమైందట. ఈ మహిళలు 17 సెకన్లలో విడిభాగాలను జోడించగలరట. ఇదో రికార్డు కూడా.
* మనం వాడే సబ్బు నుంచి ఎన్నో వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించినవే. తన హరిద్వార్ ప్లాంట్‌లో ఆపరేషన్ విభాగంలో అమ్మాయిలకు శిక్షణనిచ్చి మరీ తీసుకుంది. మూడు నెలల్లోనే ఉత్పత్తిలో 40 శాతం మెరుగుదల కనిపించింది. దీంతో క్రమంగా అమ్మాయిలకు అవకాశాలను పెంచుతోంది. సిలిగుడిలోని కోకాకోలా యూనిట్లో 60 శాతం మంది మహిళలే! పని ప్రదేశంలో వైవిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఉత్పత్తితోపాటు యంత్రాల పనితీరు పెరిగేలా ఆడవాళ్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. అందుకే క్రమంగా వారికి అవకాశాలు పెంచుతోంది.
* పురుషాధిక్య రంగాలుగా చెప్పుకునే మైనింగ్, ఆటోమొబైల్, హెవీ ఇంజినీరింగ్ సంస్థల్లోనూ మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. టాటా స్టీల్ ఝార్ఖండ్‌లోని వెస్ట్ బకరో, నోవాముండీ ప్రాంతాల్లో 38 మందిని ఎర్త్‌మూవింగ్ మెషినరీ ఆపరేటర్లుగా ఎంచుకుంది. దీనికోసం ‘విమెన్ ఎట్ మైన్స్’ పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌నూ రూపొందించింది. దీనిలానే కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ డైమ్లర్ కూడా చెన్నైలోని ట్రక్, బస్ మాన్యుఫాక్చరింగ్ విభాగంలో ఈ ఏడాది 46 మందిని నియమించింది. వీరి రక్షణతోపాటు అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లూ చేసింది. రానున్న కాలంలో వీరి పరిధిని ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఇంకా.. ఓలా తన టూవీలర్ ఫ్యాక్టరీలో పదివేల మందికిపైగా అమ్మాయిలకు అవకాశమిచ్చిందని తెలిసిందే. వేదాంత అల్యూమినియం ఒడిశాలోని జర్సగూడ ప్లాంట్‌లో ప్రధాన విభాగాలు- ప్రొడక్షన్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ మొదలైనవే కాదు ఫైర్ ఫైటింగ్‌లోనూ అందరూ మహిళలే. ఇవి మచ్చుకే! మరికొన్ని సంస్థలూ ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే.. భవిష్యత్‌లో ‘ఇవి అబ్బాయిల పనులు’ అనే మాటలకు ఆస్కారముండదనే అనిపిస్తోంది. ఈ అవకాశాలను అందుకుని సత్తా చాటడం ఇక మన వంతు!