
వసుంధర
ఏదైనా సవాల్‌ను స్వీకరించి గెలవటంలోనే మజా ఉంటుంది. దీనికి సామాజిక స్పృహను జోడించి వ్యాపారంగా మలచుకుంది దిశా మేటి. 24 రోజుల డ్యాన్స్ ఛాలెంజ్‌తో మహిళలకు ఫిట్నెస్ శిక్షణనిస్తోంది. సి.ఎ. చదువు వదిలేసి మరీ దీన్ని కెరియర్‌గా ఎంచుకున్నా అంటోన్న ఈ హైదరాబాదీ అమ్మాయి ఇప్పుడు ఎంతోమంది యువతుల ఫేవరెట్. తన ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా!!
ఈ కెరియర్ అన్నప్పుడు అమ్మానాన్నలు ప్రోత్సహించారు. నచ్చినదాన్ని ఎంచుకున్నా కనుకే బోర్, అలసట అనిపించవు. మీకు నచ్చిందే ఎంచుకోండి, అప్పుడే రాణిస్తారని అమ్మాయిలకి సలహానిస్తా. మనం మంచి కోరుకుంటే మనకీ అదే తిరిగొస్తుంది. తక్కువ సమయంలో నా విజయానికి అదే కారణమని నా నమ్మకం. అందరికీ నేను చెప్పేదొక్కటే... మీ గురించి శ్రద్ధ తీసుకునే మీ అమ్మల ఆరోగ్యం గురించి మీరూ శ్రద్ధ తీసుకోండి.
నాన్న బ్రజేష్మేటి వ్యాపారి. అమ్మ భావన గృహిణి. 30 ఏళ్ల క్రితమే మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. పదో తరగతి వరకు సికింద్రాబాద్ సెయింట్స్ ఆన్స్‌లో చదివా. తర్వాత సీఏ వైపు వెళ్లా. చిన్నప్పటి నుంచీ నృత్యం నేర్చుకుంటున్నా. అనుకోకుండా నా దృష్టి మహిళల ఫిట్‌నెస్‌వైపు మళ్లింది. ఆడవాళ్లకే ఎందుకంటే.. కుటుంబానికి అన్నీ అమరుస్తూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకుంటారు. అలాంటి వాళ్లను ఎంతోమందిని చూశా. అందుకే దీన్నే కెరియర్‌గా మలచుకోవాలనుకున్నా. నృత్యానికి అదనంగా జుంబా, ఫిట్నెస్ ట్రైనింగ్, యోగాలను నేర్చుకున్నా. పీజీనీ పూర్తిచేశా. పాఠశాల నుంచీ నా పాకెట్మనీనీ నేనే సంపాదించుకునేదాన్ని. డ్యాన్స్ శిక్షణ, నాన్నకు అకౌంటింగ్లో సాయం.. నా ఆదాయమార్గాలు. వేడుకలకు కొరియోగ్రాఫర్‌గానూ చేశా. పీజీ వరకూ ఇలానే సాగింది.
మహిళలకోసం ఫిట్నెస్ స్టూడియో పెట్టాలన్నది నా కల. 14 ఏళ్ల నృత్య శిక్షణ, చేసిన ఫిట్నెస్ కోర్సులు, విస్తృత అధ్యయనం సరిపోతాయనుకున్నా. రెండేళ్లు జిమ్‌లో ఫిట్నెస్ ట్రైనర్‌గా, ఇంకా చాలా ఉద్యోగాలు చేసి పైసా పైసా దాచిపెట్టా. నాన్న దగ్గర కొంత అప్పు చేసి హైదరాబాదు, బంజారాహిల్స్‌లో ‘డీఎంకే స్టూడియో’ ప్రారంభించా. ఇప్పటికే చాలామంది శిక్షకులున్నారు. మరి నాకో ప్రత్యేకత ఉండొద్దూ... అందుకే కొత్తదారి ఎంచుకున్నా. ఫిట్నెస్ సూత్రాలను కొత్త పద్ధతిలో దగ్గర చేయాలని ‘24 రోజుల ఛాలెంజ్’ ప్రవేశపెట్టా. మంచి ఆదరణ వచ్చింది. కొద్దికాలంలోనే నాన్న అప్పునూ తీర్చేశా. ఏడాదిన్నరలో 15 సీజన్లు పూర్తి చేశా. 16వది నడుస్తోంది. ప్రతి దానిలో 45-50 మంది శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో హైదరాబాద్, ముంబయి, దిల్లీ వంటి నగరాల వారున్నారు. వీరే కాక ఆన్లైన్ క్లాసులూ నిర్వహిస్తున్నా. ఛాలెంజ్‌లో పాల్గొనే వారికి ముందుగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తాం. దానికి అనుగుణంగా 24 రోజుల పాటు జుంబా, వర్కవుట్స్, ధ్యానం, యోగా వంటి వ్యాయామాలు డిజైన్ చేస్తా. రోజూ 15 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వీలు కల్పిస్తాం. మనసులోని భారమూ ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ఏర్పాటు. ఆహార, జీవనశైలి మార్పులూ సూచిస్తాం.
లావా సన్నమా కాదు... ఎంత ఫిట్‌గా ఉన్నారనేదే ముఖ్యం. అప్పుడే దేనిలోనైనా హిట్ అవుతాం. అందుకే రకరకాల టాస్క్‌ల ద్వారా శరీరాన్ని బలంగా, అనుకూలంగా మలచడం ద్వారా క్రమంగా బరువు తగ్గేలా చూస్తాం. సంగీతాన్ని ఆస్వాదిస్తూ వ్యాయామం చేస్తే అలసట ఉండదు. అందుకే ఈ రెండింటినీ మేళవిస్తున్నా. ‘శారీరకంగానే కాదు, మానసికంగానూ తేడా కనిపిస్తోంది. 5, 6 అంతస్తులు కూడా తేలిగ్గా ఎక్కగలుగుతున్నాం. చర్మమూ నిగారిస్తోంది’ వంటి ఫీడ్‌బ్యాక్‌లు వస్తుంటాయి. అవి విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 2500 మందికిపైగా శిక్షణనిచ్చా. ఫీజు కట్టి నేర్చుకోలేని వారి కోసం సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణివ్వాలనే ప్రయత్నంలో ఉన్నా.
- సాంబశివరావు గణాది, హైదరాబాద్