Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
ఆర్డినెన్సులు...ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

నేడు రాజ్యాంగ దినోత్సవం

నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావలసి ఉన్నా, ఎన్‌డీఏ ప్రభుత్వం అంతవరకు ఆగకుండా 14వ తేదీనే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆర్డినెన్సులు తెచ్చింది. ఏ అంశం మీదనైనా కేంద్ర, రాష్ట్ర చట్టసభల ద్వారా చట్టాలు చేయాల్సింది పోయి చీటికిమాటికి ఆర్డినెన్సులతో పని కానివ్వాలని, అలా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూడటం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం! 123వ రాజ్యాంగ అధికరణ కింద రాష్ట్రపతికి, 213వ అధికరణ కింద రాష్ట్ర గవర్నర్‌కు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం సంక్రమిస్తున్నా, దాన్ని అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయోగించాలి తప్ప చట్టసభల అగ్ర ప్రాధాన్యాన్ని నీరుగార్చకూడదు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాలను పొడిగించడం ప్రస్తుతం నడుస్తున్న కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి తోడ్పడే మాట నిజం. అయితే, ఈ రెండు సంస్థలను అధికార స్థానాల్లో ఉన్నవారు సక్రమంగా పని చేయనిస్తున్నారా అంటే, సందేహమే. ఇలాంటి అపశ్రుతులను నివారించాంటే పార్లమెంటులో కూలంకషంగా చర్చించి, అవసరమైన మార్పుచేర్పులతో చట్టాలను పకడ్బందీగా రూపొందించాలి. అలాకాకుండా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆదరాబాదరాగా ఆర్డినెన్సులు జారీ చేయడం పాలకుల సొంత రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలకు తావిచ్చింది.

చేంతాడంత జాబితా!
రాజ్యాంగం ప్రకారం ఒక అంశంపై పార్లమెంటులో, రాష్ట్ర లెజిస్లేచర్‌లో, వివిధ స్థాయీసంఘాల్లో, సంయుక్త సంఘాల్లో చర్చలు జరిపిన తరవాతే సమగ్ర చట్టం చేయాలి. దీనికి విరుద్ధంగా మొదట ఆర్డినెన్సులు జారీ చేసి, తరవాత చట్టాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలోనూ అదే జరిగింది. రైతుల సమస్యలను పార్లమెంటులో లోతుగా చర్చించి, సమగ్ర పరిష్కారాలతో చట్టాలు చేయాల్సింది పోయి, ఎన్‌డీఏ సర్కారు హడావుడిగా ఆర్డినెన్సు తీసుకువచ్చింది. ఆపైన తీరిగ్గా పార్లమెంటులో చట్టాలు చేసింది. వాటిని నిరసిస్తూ ఏడాది కాలంగా రైతులు నడిపిన ఉద్యమానికి తలొగ్గి సాగు చట్టాలను రద్దు నిర్ణయం ప్రకటించక తప్పలేదు! దేశంలో ఆర్డినెన్సు పాలనకు సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 సంవత్సరం నుంచి 2014 వరకు రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సుల జాబితా చిన్నదేమీ కాదు. లోక్‌సభ సచివాలయం 2015లో విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రపతి 2014 డిసెంబరు వరకు మొత్తం 679 ఆర్డినెన్సులు జారీ చేశారు. యూపీఏ తన పదేళ్ల పాలనలో 61 ఆర్డినెన్సులు తీసుకొస్తే, మోదీ సర్కారు ఏడేళ్లలో ఏకంగా 79 ఆర్డినెన్సులు జారీ చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఏ మేరకు విఘాతం కలుగుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. సమాజ అవసరాలను తీర్చడానికి చట్టసభలు ఎంతో తర్జన భర్జన జరిపి మరీ చట్టాలు చేస్తాయి. వాటికి అక్కడి ప్రజాప్రతినిధులు జవాబుదారీ కావాలి. రాష్ట్రపతి, గవర్నర్లు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయాలని, సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు, రాష్ట్ర లెజిస్లేచర్లకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఏ ఆర్డినెన్సు అయినా చివరకు చట్టసభల అంగీకారంతోనే శాసనంగా అమలులోకి రావాలి. ఆర్డినెన్సుల ద్వారా రాజ్యాంగ సవరణ చేసే వీలులేదు. రాష్ట్రపతి, గవర్నర్ల ఆర్డినెన్సు అధికారం మీద సమీక్ష జరిపే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంటుంది. దురుద్దేశంతోనో, స్వార్థంతోనో ఆర్డినెన్సులు జారీ కాకుండా చూడటానికి రాజ్యాంగ కర్తలు తీసుకున్న ముందుజాగ్రత్త ఇది.


 ఆ మూడు సందర్భాల్లోనే...

పార్లమెంటు, అసెంబ్లీలు నిర్ణీత కాలాల్లోనే సమావేశమవుతాయి. ఆ లోపు తాత్కాలిక ప్రాతిపదికపై ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం దఖలు పరుస్తోంది. ఆ అధికారాన్ని మూడు సందర్భాల్లో వినియోగించుకోవాలి. ఒకటి- ఏదైనా అత్యవసర స్థితి లేక అసాధారణ స్థితి ఎదురైనప్పుడు దాన్ని తక్షణం ఎదుర్కోవడానికి ఆర్డినెన్సు జారీ చేయవచ్చు. రెండు- చట్టసభల సమావేశాలు జరగనప్పుడు ఏదైనా అవాంతరం వస్తే ఆర్డినెన్సు చేయవచ్చు. మూడు- కేవలం ప్రజాహితం కోసమే ఆర్డినెన్సులు చేయాలి. కాబట్టి రాష్ట్రపతికి, గవర్నర్లకు నిర్నిబంధంగా ఆర్డినెన్సులు చేసే అధికారం లేదు. కొన్ని షరతులకు లోబడి మాత్రమే వాటిని జారీ చేయాలి. ఏ ఆర్డినెన్సునైనా చట్ట సభ సమావేశమైన ఆరు వారాల్లోపల ఆమోదించాలి. ఆ గడువులోగా చట్ట సభ ఆమోదం పొందలేకపోయిన ఆర్డినెన్సుకు కాలం చెల్లిపోతుంది. 


న్యాయపాలన సూత్రానికే విరుద్ధం

చట్టసభల సమావేశాలు జరగని రోజుల్లో ఏదైనా అవాంతర స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయాలి. అంతే తప్ప, ఈ అత్యవసర అధికారాన్ని ఉపయోగించుకుని మొత్తం శాసన ప్రక్రియను తన గుప్పిట్లోకి తీసుకోకూడదని 1987లో డాక్టర్‌ డి.సి.వాధ్వా తదితరులు వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ ప్రభృతుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం చట్టసభలకే తప్ప, ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం ఉన్నంత మాత్రాన వారు సమాంతర శాసనకర్తలుగా, స్వతంత్ర చట్టసభల్లా వ్యవహరించకూడదని 2017నాటి కృష్ణకుమార్‌ సింగ్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీం ఉద్ఘాటించింది. చట్టసభలకు జవాబుదారీ అయిన మంత్రిమండలి సిఫార్సుపైనే రాష్ట్రపతి/గవర్నర్‌ నడుచుకోవలసి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో కూడా ఆర్డినెన్సులతో పరిపాలన సాగించాలని చూడటం న్యాయపాలన సూత్రానికి విరుద్ధమని సుప్రీం తేల్చిచెప్పింది. ఏదైనా చట్టం చేసే ముందు పార్లమెంటులో, అసెంబ్లీలో కూలంకషంగా చర్చించి, లోపాలుంటే సరిదిద్ది తుది రూపమివ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్‌ కమిటీలు, సంయుక్త లెజిస్లేటివ్‌ కమిటీల సలహా సంప్రదింపులను తీసుకొంటారు. చట్టం వల్ల ప్రభావితమయ్యే వర్గాల అభిప్రాయాలను తెలుసుకొంటారు. చివరకు ప్రజాప్రతినిధులు ఆమోదించే చట్టాల్లో సమష్టి చైతన్యం ఇమిడి ఉంటుంది. తద్వారా వాస్తవికమైన, ఆచరణీయమైన చట్టాలు అమలులోకి వస్తాయి. ఆర్డినెన్సుల జారీలో ఇవేవీ ఉండవు కాబట్టి, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఎడాపెడా ఆర్డినెన్సులు జారీ చేసే ఆనవాయితీకి స్వస్తి చెప్పాలి. అత్యవసర, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్సు బాట పట్టాలి.

 


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.