Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
గొంతెత్తితే అణచివేతే

చైనా క్రీడాకారిణి అదృశ్యంపై సర్వత్రా ఆందోళన

చైనా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే అంతే సంగతులు! తమకు వ్యతిరేకంగా గొంతెత్తేవారి పట్ల డ్రాగన్‌ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి- తాజాగా ఆ దేశ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి 35 ఏళ్ల పెంగ్‌ షువాయి అదృశ్యమైన ఉదంతమే నిదర్శనం. ఆమె ఆచూకీ కోసం ప్రపంచమంతా ప్రశ్నిస్తుంటే డ్రాగన్‌ మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ నెల రెండో తేదీన చైనా సామాజిక మాధ్యమం వీబోలో ఓ పోస్టు పెట్టడమే పెంగ్‌ను కష్టాల్లోకి నెట్టింది. చైనా మాజీ వైస్‌ ప్రీమియర్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలో ఒకప్పటి కీలక నేత 75 ఏళ్ల జాంగ్‌ గవోలి తనను లైంగిక హింసకు గురి చేస్తున్నారంటూ ఆ పోస్టులో ఆరోపించారు. ఆయన వేధింపులు భరించలేకపోతున్నట్లు ఆవేదన చెందారు. డ్రాగన్‌ సర్కారు నిఘాలో ఉండే ఆ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన 20 నిమిషాలకే దాన్ని ఆమె తొలగించినా, కొంతమంది భద్రపరిచి ఇతరులతో పంచుకోవడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్టు చేసినప్పటి నుంచి పెంగ్‌ ఆచూకీ దొరకడం లేదు. దీంతో పెంగ్‌ ఎక్కడ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం మొదలైంది. పురుషుల నంబర్‌ఒన్‌ టెన్నిస్‌ ఆటగాడు జకోవిచ్‌, జపాన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి నవోమి ఒసాక, మహిళల మాజీ నంబర్‌ఒన్‌ సెరెనా విలియమ్స్‌ సైతం ఆమె అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

పెంగ్‌ ఆచూకీ బయట పెట్టాలని మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఛైర్మన్‌ స్టీవ్‌ సిమన్స్‌ డిమాండ్‌ చేశారు. ఆమె బయటకు రాకపోతే చైనాతో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడానికి వెనకాడబోమని, అక్కడ టోర్నీలు నిర్వహించబోమని ఆయన హెచ్చరించారు. ఆమె చేసిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపించాలన్నారు. పెంగ్‌ ఆచూకీపై అమెరికా, బ్రిటన్‌ కూడా చైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆమె ఆచూకీపై సరైన ఆధారాలు బయట పెట్టాలంటూ ఐరాస సైతం స్పందించింది. పెంగ్‌ అదృశ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా- డ్రాగన్‌ పలకడం లేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు జాంగ్‌ సన్నిహితులు కావడంతో ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. పెంగ్‌ తన నివాసంలో సురక్షితంగా ఉన్నారనే భావన కల్పించేలా ఆమె ఫొటోలు, వీడియోలను అనుకూల మీడియాలో ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీచాట్‌ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్‌ తన ఫొటోలు పెట్టినట్లు స్థానిక టీవీ ఛానల్లో పనిచేసే షెన్‌ షీవీ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. పెంగ్‌ తన ఇంట్లోనే క్షేమంగా ఉన్నారని, త్వరలోనే బయటకు వస్తారంటూ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ హూ జిజిన్‌ చెబుతున్నారు. మరోవైపు తాను సురక్షితంగానే ఉన్నానని, జాంగ్‌పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ సిమన్స్‌కు పెంగ్‌ మెయిల్‌ పంపినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమెతో బలవంతంగా మెయిల్‌ పంపించారేమోనంటూ సిమన్స్‌ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. బీజింగ్‌లోని ఓ క్రీడాపోటీకి పెంగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారంటూ సంబంధిత ఫొటోలు, వీడియోలనూ బయటపెట్టారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌తో ఆమె వీడియో కాల్‌ మాట్లాడారంటూ ఐఓసీ ప్రకటించింది.

ఇలా- పెంగ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో ఆమె ఆచూకీపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఆమెపై ప్రభుత్వ ఒత్తిడి లేకుంటే, నేరుగా బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె క్షేమంగానే ఉన్నట్లు నమ్మించేందుకు చైనా ఎందుకు ప్రయత్నిస్తోందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌కు చైనా ఆతిథ్యమిస్తోంది. పెంగ్‌ ఉదంతం కారణంగా ఆ క్రీడలు జరగకపోతే, దేశ గౌరవానికి భంగం కలగడంతోపాటు, ప్రపంచం ఎదుట బీజింగ్‌ దోషిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే, ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రీడాపోటీలు కొనసాగాలనే ఉద్దేశంతో పెంగ్‌ సురక్షితంగానే ఉన్నట్లు నమ్మబలికేందుకు చైనా- విభిన్న మార్గాల ద్వారా యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకూల మాధ్యమాలతో పాటు తమకు సహకరించే ఐఓసీ సాయం తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా విషయంలోనూ గతేడాది డ్రాగన్‌ ఇదేతీరులో వ్యవహరించిన సంగతి తెలిసిందే. చైనా కుబేరుడైన జాక్‌- తమ ప్రభుత్వ వాణిజ్య విధానాలను విమర్శించడంతో మూడు నెలల పాటు అదృశ్యమై, బయటికొచ్చారు. ఇప్పుడు పెంగ్‌ పరిస్థితి సైతం అలాగే ఉండటంతో, ప్రశ్నించేవారి గొంతు నొక్కడం డ్రాగన్‌కు పరిపాటిగా మారిందని ప్రజాస్వామికవాదుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- ఎస్‌.చందు  

 


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.