
వసుంధర
ఎన్నో రంగాల్లో విజేతలతో మాట్లాడిన అనుభవం శ్రేయసిది. వాళ్ల శ్రమ, త్యాగాలు, విజయ రహస్యాలతో ఉత్తేజితురాలైంది... స్ఫూర్తి పొందింది. వాళ్లలా నేనెందుకు కాకూడదు అనుకుంది... తన పరిజ్ఞానాన్ని తోటి యువతకు పంచాలనుకుంది... ఆ ఆలోచననే స్టార్టప్‌గా మలచుకొని లక్షల మందికి దిశా నిర్దేశం చేస్తూ... విజయపథంలో నడుస్తోంది!
శ్రేయసి జర్నలిస్ట్. వృత్తిలో భాగంగా వివిధ రంగాల ఆంత్రప్రెన్యూర్లలను ఇంటర్వ్యూలు చేసేది. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వాళ్లతో మాట్లాడటం వల్ల పరిజ్ఞానంతోపాటు వాళ్ల ఆలోచనలు, వ్యూహాలు, టూల్స్ మొదలైన వాటిపైనా అవగాహన వచ్చేది. వాటన్నింటి నుంచి స్ఫూర్తిని పొందేది. క్రమంగా తన లక్ష్యం ఉద్యోగం కాదు వ్యాపారమేనని అర్థమైంది. తను చదివిందేమో డిగ్రీలో చరిత్ర, పీజీలో మాస్ కమ్యూనికేషన్స్. అయినా తను సాధించిన నైపుణ్యాలు సాయపడతాయనుకుంది. వాటిని నేర్పడమే వ్యాపారంగా మలచుకుంది. స్నేహితుడు ప్రథమ్ రాజ్‌తో కలిసి దిల్లీ కేంద్రంగా ‘హరప్పా ఎడ్యుకేషన్’ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు నైపుణ్యాలను నేర్పిస్తుందీ సంస్థ.
విద్య కంటే నైపుణ్యాలపై దృష్టిపెట్టడం మంచిదని భావించింది. ఒక విషయాన్ని రకాలుగా ఆలోచించడం, సమస్యా పరిష్కారం, కమ్యూనికేషన్, రిలేషన్షిప్ బిల్డింగ్, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, నెట్వర్కింగ్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం వంటి సంస్థాపరమైన నైపుణ్యాలపై 25 కోర్సులను యాప్, సైట్లలో అందిస్తోంది. ఇందుకు విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థల సాయమూ, సలహాలూ తీసుకుంటోంది.
మేం మారుతున్నాం... మీరూ మారాలి
‘2019 నుంచి కోర్సులను అందుబాటులోకి తెచ్చాం. సంస్థలతో కలిస్తేనే వారి అవసరాలు తెలుస్తాయి. ఆ కారణంతోనే ఐఐటీ గాంధీనగర్, పంజాబ్ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలతోపాటు ప్రముఖ ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల సాయంతో కరిక్యులమ్ రూపొందిస్తున్నాం. 60 మంది దీనిపై పనిచేస్తుంటారు. టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. మార్కెట్ గతిశీలంగా ఉంటోంది. వీటిని బట్టి వ్యాపార నైపుణ్యాలూ మారుతున్నాయి. అందుకే మొదట్లో 20-30 ఏళ్ల వారిని దృష్టి పెట్టుకున్నా ఇప్పుడు అన్ని వయసుల వారికీ కోర్సులు రూపొందిస్తున్నాం. వాటినీ నవీకరిస్తూంటాం. ఏడాదిలోనే లక్ష మందికిపైగా మా దగ్గర చేరారు. 3.5 లక్షలకుపైగా పెయిడ్ సబ్స్క్రైబర్లున్నారు. పెరుగుతున్న సంఖ్యను చూస్తే విజయం సాధించామనే అనిపిస్తోంది. అలాగని ఎప్పుడూ అవే కోర్సులను ఉంచం. కాలానుగుణ మార్పులకు తగ్గట్టుగా రూపొందిస్తుంటాం’ అని వివరిస్తోంది శ్రేయసి. రెవెన్యూ సంగతులు మాత్రం బయటపెట్టను అంటోంది. వచ్చే ఏడాది చివరికి 90 - 100 కోట్ల టర్నోవర్ లక్ష్యమని, దాన్ని సాధించగలమని ధీమాగా చెబుతోంది.
అమ్మాయిలకు చెప్పేదొకటే... నిరంతరం నైపుణ్యాలను నేర్చుకుంటూ వాటిని పనిలో ప్రవేశపెడుతుండాలి. సాంకేతిక, వ్యవహార పరంగా వచ్చే మార్పులను తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మన విజయ ప్రస్థానం కొనసాగుతూ ఉంటుంది.