
ఆంధ్రప్రదేశ్
మండలిలో భాజపా సభ్యుల ఆందోళన
భాగస్వాములతో చర్చించాకే ఈ విధానం తెచ్చామన్న మంత్రి
మండలిలో భాజపా సభ్యుల ఆందోళన
ఈనాడు, అమరావతి: సినిమా టికెట్లు విక్రయించడంతో వచ్చే ఆదాయంపైనా కొత్త అప్పులు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమని మండలిలో భాజపా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే టికెట్లు విక్రయించాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ సినిమాల (క్రమబద్ధీకరణ) చట్టానికి సవరణ బిల్లును సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని శాసనమండలిలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాజపా సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘అవసరం లేని విషయాల్లో ప్రభుత్వం తలదూరుస్తోంది. ఇసుకను ప్రైవేట్ సంస్థకు దారాదత్తం చేశారు. ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించే విధానం ఇప్పటికే అమలులో ఉండగా ...ప్రభుత్వం ఈ బాధ్యతను నిర్వహించాలనుకుంటోంది. మద్యంపై ఆదాయం చూపించి అప్పులు చేశారు. ఇప్పుడు సినిమా టికెట్ల ఆదాయంపైనా అప్పులు తేవాలని చూస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. లేదంటే నిర్మాతలు, పంపిణీదారులు, సినిమా థియేటర్ల యజమానులు కోర్టుకి వెళ్లేందుకు సిద్ధమవుతారు’ అని భాజపా పక్ష నాయకుడు మాధవ్ అన్నారు. ‘ప్రజలు సినిమా చూసేందుకు వస్తుంటే ..రోజుకి 4 ఆటలే (షో) వేయాలని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటి? రోజులో 6 షోలు వేసేందుకు అనుమతించాలి’ అని భాజపా సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న సినిమా పరిశ్రమను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని హితవు పలికారు. టికెట్లు విక్రయించగా వచ్చిన డబ్బును తిరిగి ఎన్ని రోజుల్లోగా థియేటర్ల ఖాతాలకు జమ చేస్తారో చెప్పాలని పీడీఎఫ్ సభ్యుడు కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. సినిమా టికెట్ల విక్రయాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని వైకాపా సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఇక్బాల్, సూర్యనారాయణ రాజు అన్నారు.
అవగాహన లేని మాటలు: మంత్రి పేర్ని నాని
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలపై భాజపా సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇవి వాళ్ల మనసులో నుంచి వచ్చిన మాటలు కాదని, వేరొకరు ఫోన్లో చెబితే మాట్లాడినట్లుగా భావిస్తున్నానని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. 35 రోజులు షూటింగ్, రాజకీయాలు కాదు.. ఏడాదికి పది సినిమాలు తీస్తే సినీ పరిశ్రమలో అన్ని విభాగాల్లోని కార్మికులకూ ఉపాధి లభిస్తుందని పరోక్షంగా పవన్‌కల్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి అన్నారు. కొవిడ్‌తో నష్టపోయిన థియేటర్లకు ఫిక్స్డ్ పవర్ ఛార్జీలను తమ ప్రభుత్వం రద్దు చేసి ఆదుకుందని వివరించారు. తెలుగు సినీ పరిశ్రమల్లో భాగస్వాములందరితో చర్చించాకే జీఎస్టీ ఎగవేత లేని ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయ విధానాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. బ్లాక్‌బస్టర్ సినిమాలకు కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినపుడు...ప్రభుత్వానికి అదే స్థాయిలో జీఎస్టీ ఆదాయం ఎందుకు రావడం లేదో సభ్యులు కూడా ఆలోచించాలని మంత్రి సూచించారు. రూ.30 నేల టికెట్ బ్లాకులో రూ.1,000 నుంచి రూ.1,500కు విక్రయించడం భావ్యమా అని ప్రశ్నించారు. అందరికీ టికెట్లు అందుబాటులో ఉండేలా ‘వెబ్, సిమ్ ఆధారిత సాఫ్ట్వేర్ తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. టికెట్లపై వచ్చే ఆదాయాన్ని మరుసిటి రోజు ఉదయమే థియేటర్ల ఖాతాకు జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాంటపుడు ప్రభుత్వం అప్పు తీసుకునే ప్రశ్నే తలెత్తదన్నారు. రోజుకు ఎనిమిది షోలు వేస్తే థియేటర్లు ఎప్పుడు శుభ్రం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. చట్ట ప్రకారం థియేటర్లు ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 11.30 గంటలకు మూసి వేయాలని అన్నారు. ‘మాది రివర్స్ ప్రభుత్వమని భాజపా సభ్యులు అంటున్నారు. కేంద్రంలోని మీది రివర్స్ ప్రభుత్వం కాదా? 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదా? దీనిపై ఏం సమాధానం చెబుతారు’ అని మంత్రి ప్రశ్నించారు.