
ఆంధ్రప్రదేశ్
తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
వైద్యులు, అధికారులు సూచించాలి
29 నెలల్లో రూ.4వేల కోట్ల వ్యయం
శాసనసభలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: వైద్యులు, అధికారులు సూచిస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోనికి మరిన్ని చికిత్సలను తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 1,096 చికిత్సలు అందుబాటులో ఉండగా వాటిని తాము 2,446కు పెంచామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా గడిచిన 29 నెలల్లో రూ.4వేల కోట్లు వ్యయం చేశామని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో గురువారం ‘ఆరోగ్య రంగం’పై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. ‘మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వమిది. వార్షిక పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రూ.1,000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. సుమారు రూ.10లక్షల ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్, మూగ, చెవిటి పిల్లల కోసం రూ.12 లక్షల ఖరీదైన బైకాంక్లియర్ ఆపరేషన్, రూ.11 లక్షల ఖరీదైన గుండె మార్పిడి, రూ.9 లక్షల వరకు వ్యయమయ్యే స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలను కూడా అందిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లోని 130 సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల్లో పేదలు వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాం. కొవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందిస్తూ పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాం.బిల్లులు పంపిన 21 రోజులకు అనుబంధ ఆసుపత్రులకు చెల్లింపులు జరిగేలా సీఎం కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తోంది. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ‘ఆసరా’ కింద ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నాం...’’ అని సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సేవల కొనసాగింపులో కత్తిరింపులు ఉండేవన్నారు.
వచ్చే నెలాఖరుకి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్!
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వచ్చే నెలాఖరు(డిసెంబరు) నాటికి తొలి విడత కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ‘‘రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 87% మందికి ఒక డోసు వ్యాక్సిన్ అందించాం. రానున్న మార్చి నాటికి 2 డోసుల పంపిణీ పూర్తవుతుంది. కొవిడ్ మరణాల రేట్ రాష్ట్రంలో 0.70% మాత్రమే. కొవిడ్ వచ్చిన 99.3% మందిని కాపాడుకున్నాం. వైద్య సిబ్బంది 31సార్లు ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య లక్షణాల గురించి వివరాలు సేకరించారు...’’ అని పేర్కొన్నారు.
రూ.16,255 కోట్లతో నాడు-నేడు పనులు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేసి, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురాబోతున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ‘‘గిరిజన ప్రాంతాల్లో సైతం బోధనాసుపత్రి కొత్తగా రాబోతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు కూడా వస్తున్నాయి. రూ.16,255 కోట్లతో నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు 9,712 వైద్యులు, ఇతర పోస్టులు, 15వేల ఎ.ఎన్.ఎం. పోస్టులు భర్తీ చేశాం. కొత్తగా మళ్లీ 14,788 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తాం. కేవలం ఆరోగ్య శాఖలోనే 40వేల వరకు పోస్టులు భర్తీ అవుతున్నాయి. 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువస్తున్నాం. కొత్తగా 400కు (104)పైగా అంబులెన్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా 66 లక్షల మందికి పిల్లలకు పరీక్షలు చేశాం. 3 ప్రాంతాల్లో ఛైల్డ్‌కేర్ ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ఆసక్తి ఉన్న సంస్థలకు ఉచితంగా భూమి అందజేసి, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటు జరిగేలా కృషి చేస్తున్నాం. వీటిల్లో 50% పడకలు ఆరోగ్యశ్రీ కింద కేటాయిస్తారు. వైద్య రంగంలో తీసుకువస్తున్న చర్యల వల్ల రానున్న 6 నెలల్లో మంచి సంస్కరణలు అమల్లోనికి వస్తాయి...’’ అని సీఎం జగన్ వివరించారు.