
క్రీడలు
దిల్లీ: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ బరిలో దిగనున్నాడు. డిసెంబరు 1న ఇండోనేసియాలోని బాలిలో ప్రారంభంకానున్న ఈ టోర్నీకి లక్ష్యసేన్ అర్హత సాధించాడు. భారత్ తరఫున ఈ టోర్నీలో పాల్గొంటున్న పిన్న వయస్కుడిగా 20 ఏళ్ల లక్ష్యసేన్ రికార్డు సృష్టించనున్నాడు. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న లక్ష్యసేన్ ప్రపంచ టూర్ ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. కిదాంబి శ్రీకాంత్ (3వ ర్యాంకు) టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి.సింధు (4వ ర్యాంకు), సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప (6వ ర్యాంకు) ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో బరిలో దిగుతున్నారు. గతంలో శ్రీకాంత్, సమీర్‌వర్మ, సింధు, సైనా నెహ్వాల్‌లు ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. 2018లో సింధు టైటిల్ సాధించగా.. 2011లో సైనా రన్నరప్‌గా నిలిచింది. శ్రీకాంత్, సమీర్ నాకౌట్‌కు చేరుకున్నా.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ప్రపంచ టూర్ ర్యాంకింగ్స్‌లో ప్రతి విభాగంలో తొలి 8 స్థానాల్లో ఉన్న క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటారు.