
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఆదిమూలపు సురేష్
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలను మానవ తప్పిదమని చంద్రబాబు చెప్పడం దారుణమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. బాధితుల సమస్యల్ని రాజకీయ కోణంలో చూడటం దుర్మార్గమన్నారు. తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు రేయింబవళ్లు కష్టపడి చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు చంద్రబాబుకు కనిపించట్లేదా? అని దుయ్యబట్టారు. సచివాలయ ఆవరణలో మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే రోజా గురువారం విలేకర్లతో మాట్లాడారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ‘కడప జిల్లాలో బాధిత కుటుంబాలన్నింటికీ తక్షణ ఆర్థికసాయం కింద రూ.5,800 చొప్పున అందించాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం. 100% గ్రామాలకు విద్యుత్తును పునరుద్ధరించాం. వైకాపా ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇవేమీ కనిపించనట్టు సీఎం జగన్‌పై చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారు’ అని మండిపడ్డారు.