
ఆంధ్రప్రదేశ్
మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు-అమరావతి: మద్యంపై కాలానుగుణంగా వ్యాట్ తగ్గించడమో, పెంచడమో చేస్తుంటామని.. ప్రస్తుతం అన్ని రకాల మద్యం విక్రయాలపై పన్ను 70శాతం మించకుండా సర్దుబాటు చేస్తున్నామని ఆర్థిక, వాణిజ్య పన్నులశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాట్ చట్టం 2005కు సవరణలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో సైతం మద్యంపై పన్ను 70శాతం వరకు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ఆయన వస్తుసేవల పన్ను 2005 చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఉద్దేశాన్ని వివరించారు. ఆ తర్వాత శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రకాల మద్యంపై 130శాతం నుంచి 190శాతం వరకు పన్ను ఉందన్నారు. అది 35శాతం నుంచి 60శాతం వరకు సర్దుబాటు చేసి 70శాతం మించకుండా ఉండేలా చూస్తున్నామన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి ఏడాదికి రూ.5,600 కోట్లు తగ్గబోతోందని పేర్కొన్నారు.
బిల్లులోని ముఖ్యాంశాలు...
దేశీయ తయారీ విదేశీ మద్యంలో (బీరు, వైన్, ఇతర సిద్ధంగా ఉన్న రకాలు కాకుండా)..
* ప్రస్తుతం రూ.400 వరకున్న వాటిపై పన్ను ఇక 50 శాతం
* రూ.400 నుంచి రూ.2,500 వరకున్న వాటిపై పన్ను ఇక 60శాతం
* రూ.2,500 నుంచి రూ.3,500 వరకున్న రకాలపై పన్ను ఇక 55శాతం
* ఆపైన రూ.5,000 వరకు ధర ఉన్న రకాలపై పన్ను 50శాతం
* రూ.5,000కు మించి ధర ఉన్న వాటిపై పన్ను 45శాతం
* బీరు బాటిళ్లపై రూ.200లోపు ధర ఉన్న బాటిళ్లపై పన్ను 50శాతం, రూ.200పైన ధర ఉంటే పన్ను 60 శాతం
* వైన్‌పై పన్ను 35శాతం
* తాగడానికి సిద్ధంగా ఉన్న రకాలపై 50శాతం పన్ను విధించనున్నారు.
మద్యానికి దూరం చేసేందుకే ధరల పెంపు: మంత్రి నారాయణస్వామి
మద్యం వినియోగం నుంచి ప్రజలను దూరం చేసేందుకే ధరలు పెంచినట్లు రాష్ట్ర మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వ కొత్త ఆబ్కారీ విధానంతో ఐఎంఎఫ్ఎల్ వినియోగంలో 37%, బీర్ల వినియోగంలో 77% తగ్గుదల కనిపించిందన్నారు. మద్య నిషేధాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తామని సభ్యులు ప్రశ్నించగా... మద్యం వినియోగాన్ని తగ్గించే విధానానికి కట్టుబడి ఉన్నట్లు మంత్రి సమాధానమిచ్చారు.