
ఆంధ్రప్రదేశ్
ప్రధానోపాధ్యాయుల నుంచి వేతనాల రికవరీకి ఆదేశాలు
ఈనాడు, అమరావతి: మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలను నియమించుకున్న ప్రధానోపాధ్యాయుల నుంచి వేతనాలను రికవరీ చేయాలని మధ్యాహ్న భోజనం సంచాలకుడు మహ్మద్ దివాన్ మైదిన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2,568 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, వీటిల్లోని 1,477 బడుల్లో ఆయాలను నియమించారన్నారు. అదే సమయంలో 933 చోట్ల మరుగుదొడ్లున్నా ఆయాలను నియమించలేదన్నారు. ప్రధానోపాధ్యాయులు యాప్‌లలో నమోదు చేసిన వివరాల ఆధారంగా వీటిని గుర్తించారు. మరుగుదొడ్లు లేనిచోట పనిచేస్తున్న ఆయాలను తొలగించాలని, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుని, ఆయాల వేతనాలను రికవరీ చేయాలని ఆదేశించారు.