
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: చెరువులు, వాగులు, కుంటల ఆక్రమణలపై అధికార వైకాపా సభ్యులు శాసనసభలో గురువారం ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ భూములను సంరక్షించాలని కోరారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. చాలాకాలం నుంచి సభలో ఆక్రమణల గురించి ప్రస్తావించినప్పుడు శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని సమాధానం రావడం పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ చెరువుల ఆక్రమణలు కాలనీలుగా మారుతున్నాయన్నారు. ఆక్రమణలు జరగకుండా ఉండేలా చెరువుల హద్దులు గుర్తించాలని మరో సభ్యుడు రఘురామిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా ఆక్రమణలపై మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందువల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.