
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు నూటికి నూరుశాతం కనీస మద్దతుధర చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. శాసనసభలో గురువారం సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వ్యవసాయ శాఖకు చెందిన ఈ-క్రాప్, ఈ-కేవైసీ ఆధారంగా ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలు అందిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు చేస్తామన్నారు. కేంద్రం నిర్ణయించిన నిర్దిష్ట సగటు నాణ్యత ప్రకారం గ్రేడ్-ఎ క్వింటాలు ధర రూ.1,960, సాధారణ రకం రూ.1,940 వరకు ఉందన్నారు.
* మత్స్యకారుల ప్రయోజనం కోసం 9 హార్బర్లను ఏర్పాటుచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. తొలిదశలో 4, మలివిడతలో 5 హార్బర్లను రూ.3,507.57 కోట్లతో ఏర్పాటుచేస్తామని, వీటిద్వారా 76,230 మంది మత్స్యకారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో ‘వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ మెగాహబ్’లో పరిశ్రమల ఏర్పాటుకు 42 సంస్థలు ముందుకొచ్చాయని, వీటి ద్వారా 7,410 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
* అమూల్‌కు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు పాల ఉత్పత్తిదారులు విముఖంగా ఉన్నారన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని పశు సంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు అన్నారు. మహిళా పాడి సహకార సంఘాల ద్వారా 2020 నవంబరు నుంచి ఇప్పటివరకు 137.68 లక్షల లీటర్ల పాలను సేకరించామన్నారు.