
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, అమరావతి: కరోనా మూడో వేవ్‌కు సంబంధించి కేంద్రం నుంచి ఇతరత్రా ఎలాంటి హెచ్చరికలు లేకున్నా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి జగన్ ముందు చూపుతో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించారు. కరోనా వేళ తిరుపతి రుయాలో జరిగిన ఘటన వంటివి మళ్లీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లోను ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన ప్లాంట్లు ఏర్పాట్లు చేశాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో గురువారం ‘ఆరోగ్య పరిస్థితులపై’ స్వల్పకాల చర్చను మంత్రి నాని ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య ఆసరా కింద సర్జరీ తర్వాత కూడా చేయూత అందిస్తున్నామని, ఇందుకోసం రూ.451 కోట్లు ఖర్చు చేశామన్నారు. మంత్రి ఆళ్ల నాని ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కొంత సమాచారాన్ని కాగితంపై రాసి పంపడం గమనార్హం.
66 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్
ధార్వాడ, న్యూస్‌టుడే: కర్ణాటకలోని ధార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలకు చెందిన 66 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులుంటున్న 2 హాస్టళ్లను మూసివేశారు. ఈ హాస్టళ్లలో 400 మంది ఉండగా 300 మందికి పరీక్షలు చేశారు. మిగిలిన వారికీ పరీక్షలు చేయనున్నారు. విద్యార్థులందరూ ఇప్పటికే టీకా వేయించుకున్నందున ఆందోళన అవసరం లేదని వైద్య అధికారులు వెల్లడించారు.