Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రైమ్

Facebook Share Twitter Share Comments Telegram Share
పైన వర్మి కంపోస్ట్‌.. కింద గంజాయి

1820 కిలోలు స్వాధీనం.. అయిదుగురి అరెస్టు
సీలేరు నుంచి వస్తుండగా పట్టుకున్న పోలీసులు
పరారీలో ప్రధాన సూత్రధారి

పోలీసులు పట్టుకున్న నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి వస్తున్న లారీని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో ఆపి తనిఖీ చేసి.. అందులో 1820 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు కనుగొన్నారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా.. మరో అయిదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరినుంచి లారీ, కారు, రూ.41 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, వాహనాల విలువ రూ.3.07 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ గురువారం వివరాలను వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన సంజయ్‌ లక్ష్మణ్‌ షిండే(26), సంజయ్‌ బాలాజీ కాలే(30) సోదరులు. అభిమాన్‌ కల్యాణ్‌ పవార్‌(49) వీరికి బంధువు. సంజయ్‌ ఛోగ్లే(45), భరత్‌ కాలప్పా యేవ్లే(37) స్నేహితులు. ప్రధాన సూత్రధారి లక్ష్మణ్‌ షిండేకు సీలేరులోని సరఫరాదారులతో సంబంధాలున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల వరకు గంజాయి వీరు చేర్చుతారు. తర్వాత లక్ష్మణ్‌ వినియోగదారులకు సరఫరా చేస్తుంటాడు. ఇతనికి తాజాగా 2 వేల కిలోల గంజాయి కావాలని ఆర్డర్‌ వచ్చింది. దీన్ని ఉస్మానాబాద్‌ వరకు తీసుకొస్తే లాభాల్లో వాటా ఇస్తానని పశ్చిమబెంగాల్‌కు చెందిన డ్రైవర్‌ షేక్‌ రహీదుల్‌(27)ను లక్ష్మణ్‌ ఒప్పించాడు.

కంపోస్టుతో కవర్‌ చేసి...

ఈనెల 23న రహీదుల్‌ లారీ తీసుకుని సీలేరు వెళ్లాడు. అదేరోజు రాత్రి సరఫరాదారులు ఆ వాహనాన్ని మరోచోటుకు తీసుకెళ్లి 182 ప్యాకెట్ల్ల(ఒక్కో టి 10 కిలోలు)ను లారీలో ఉంచి పైన పెద్దకవర్‌ కప్పారు. అవి కనిపించకుండా వర్మీ కంపోస్ట్‌ బ్యాగులను లోడ్‌ చేశారు. రహీదుల్‌ లారీ తీసుకుని నర్సీపట్నం, రాజమహేంద్రవరం, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్‌ మీదుగా హైదరాబాద్‌ శివారుల్లోని పంతంగి టోల్‌ ప్లాజాకు గురువారం తెల్లవారుజామున చేరుకున్నాడు. వీరిలో నలుగురు మహారాష్ట్ర నుంచి కారులో బుధవారం అర్ధరాత్రి పంతంగి టోల్‌ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడ సంజయ్‌ ఛోగ్లే లారీలోకి ఎక్కాడు. మిగిలినవారు కారులో ముందు వెళ్తూ డ్రైవర్‌కు దారి చూపిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఎల్బీనగర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలోని బృందం అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో లారీని పట్టుకున్నట్లు మహేశ్‌ భగవత్‌ వివరించారు. కిలో రూ.8 వేలకు కొని రూ.15 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారన్నారు. ‘ఈ ఏడాది 5 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని.. 31 మందిని అరెస్ట్‌ చేశాం. ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం వీరి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రధాన నిందితుడి కోసం  గాలిస్తున్నాం’ అని సీపీ వివరించారు.

గంజాయి దమ్ము తగ్గుతోంది

ఈనాడు, హైదరాబాద్‌: గంజాయి రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించడంతో పోలీసుశాఖలో కదలిక వచ్చింది. వారు అప్రమత్తమై దాడులు చేపడుతున్నారు. గత 2 నెలల కాలంలో 40కి పైగా కేసులు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. రాజధానికి ముఖద్వారంగా ఉన్న రాచకొండ కమిషనరేట్‌లో గురువారం ఒక్కరోజే రూ.3 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కడా లేకపోయినా.. వాడకం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌లో అమ్మకాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు.

మూడు మార్గాలపై ప్రత్యేక దృష్టి

ఉత్తరాంధ్రలో సాగవుతున్న గంజాయి హైదరాబాద్‌ మీదుగా ఉత్తర భారతానికి రవాణా అవుతోంది. ఇందులో కొంత రాష్ట్రంలోకి వస్తుంది. దీంతో పోలీసులు రవాణా మార్గాలపై కన్నేశారు. ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పటిష్ఠం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాజమహేంద్రవరం- విజయవాడ- సూర్యాపేట మీదుగా ఒక మార్గం; రాజమహేంద్రవరం- ఖమ్మం- సూర్యాపేట మీదుగా మరోమార్గం; చింతూరు- భద్రాచలం, సూర్యాపేట మీదుగా.. మొత్తం మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర నుంచి గంజాయి ఏమార్గంలో వచ్చినా హైదరాబాద్‌ చేరుకోవాల్సిందే. కొంత మాత్రమే వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ మీదుగా మహారాష్ట్ర చేరుకుంటుంది. అందుకే ఈ రహదారుల మీదుగా వెళ్లే వాహనాలు అన్నింటిపైనా నిఘా పెట్టడంతో పాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు. భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్నవారు ఉత్తరాంధ్ర వ్యాపారులతో కుమ్మక్కై చాటుగా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. గత 2 నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో గంజాయికి సంబంధించి 75కి పైగా కేసులు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర నుంచి రవాణా అయ్యే గంజాయి రాజధానికి రాచకొండ కమిషనరేట్‌ మీదుగానే చేరుకోవాలి. అందుకే ఈ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది రూ.10 కోట్ల విలువైన 5 వేల కిలోల గంజాయి పట్టుకున్నారు. పోలీసుల నిఘా తీవ్రం కావడంతో గంజాయి రవాణా తగ్గుముఖం పడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.