
జాతీయ- అంతర్జాతీయ
జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
నోయిడా విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మోదీ..
చిత్రంలో యూపీ సీఎం యోగి, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఈనాడు, లఖ్‌నవూ/జేవర్: దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడూ స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించారు. తాము మాత్రం దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవర్ వద్ద నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త విమానాశ్రయ నిర్మాణంతో ఎగుమతుల కేంద్రంగా ఉత్తర్‌ప్రదేశ్ మారుతుందన్నారు. 2024 కల్లా నిర్మాణం పూర్తవుతుందని, ఉత్తర భారతదేశానికి ఇది సరకు రవాణా ముఖద్వారంగా నిలుస్తుందన్నారు.
‘జేవర్’ విశిష్టతలు..
1,330 ఎకరాల్లో రూపుదాలుస్తున్న విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటి కానుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలుస్తుందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 40 ఎకరాల్లో నిర్వహణ, మరమ్మతు, పరీక్షలకు సంబంధించి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 2024 సెప్టెంబరు నాటికి ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. దిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తారు. దీనిద్వారా లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, రూ. 34 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ఎన్నికలు ఉన్నాయనే..: ప్రతిపక్షాలు
జేవర్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి విమర్శించారు. విక్రయించడానికే భాజపా విమానాశ్రయాలను నిర్మిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు.