Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
పెద్దపులికి కొరవడిన రక్షణ

అత్యావశ్యకం నిరంతర నిఘా

వంద సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉండగా, ఇప్పుడా సంఖ్య సుమారు నాలుగు వేలకు పడిపోయినట్లు అంచనా. ఒకప్పుడు తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతమంతా వ్యాపించి ఉండే పులులు, ప్రస్తుతం పదమూడు దేశాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ప్రకృతి, ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ 1986లో వీటిని ‘రెడ్‌ లిస్ట్‌’లో చేర్చింది. అంతరించిపోయే ప్రమాదం అంచున ఉన్నజాతిగా పేర్కొంది. ప్రపంచంలోని పులుల్లో 70 శాతం మనదేశంలోనే ఉన్నాయి. 1973లో ప్రారంభించిన ‘ప్రాజెక్టు టైగర్‌’- టైగర్‌ రిజర్వ్‌ల ఏర్పాటుకు దారితీసి, 1970లలో 1200గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు సుమారు మూడువేలకు చేరడానికి దోహదపడింది. ఈ నెల 22-28 తేదీల్లో అటవీ శాఖ ‘అఖిల భారత పులి గణన-2021’ను చేపట్టింది. శిక్షణ పొందిన అటవీశాఖ సిబ్బంది, వాచర్లు అటవీ దారుల్లో, వాగుల్లో గస్తీ తిరిగి, పులి పాదముద్రలు, ఇతర సంజ్ఞలను పరిశీలించడం ద్వారా పులుల గణన చేపట్టాలన్నది లక్ష్యం. అడవుల్లో అమర్చే కెమెరాలు, రేడియో కాలర్‌ సాంకేతికతల ద్వారా ఉనికిని గుర్తిస్తారు.

జీవవైవిధ్యానికి చేటు

అడవులు నశించి పొలాలు పెరగడం, రోడ్లు, జలాశయాలు, గనులు, వ్యవసాయం, జల విద్యుత్‌ కేంద్రాలు వంటి వాటితో పులుల ఆవాసాలకు ముప్పు వాటిల్లుతోంది. దాంతోపాటు వివిధ కారణాలతో పులి జాతి అంతరించే ప్రమాదం తలెత్తుతోంది. మూఢనమ్మకాల కారణంగా పులిచర్మం, గోళ్లు, దంతాలు, వెంట్రుకలు వంటివాటికి దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ ఉండటం, చైనీయుల మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తుండటంతో వ్యాఘ్రాల వధ కొనసాగుతోంది. పులి ఆహారం- దుప్పులు, జింకలు వంటి గిట్టల జంతువులే. వాటిని వేటాడటంతో ఆహార లభ్యత తగ్గి ఆసియా దేశాల్లో పులుల జనాభా గణనీయంగా క్షీణించింది. పెద్దపులి ఆహారం కోసం చిరుతపులితో పోటీని ఎదుర్కొంటుంది. ఎలుగుబంటి, హైనాలను చంపిన సందర్భాలున్నా, అవి పులికి నిజమైన వేట జంతువులు కాదు. గుంపుగా ఉండే అడవి కుక్కలు, పెద్దపులి సాధారణంగా పరస్పరం దూరంగా ఉంటాయి. గాయాలు, జబ్బుల బారిన పడటం వంటి కారణాలతో శారీరకంగా బలహీనంగా మారి జంతువులను వేటాడలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. పులికి సహజమైన ఆహారం, గిట్టల జంతువులే తప్ప మనిషి కాదు. 

పెద్దపులి అటవీ ఆవరణ వ్యవస్థలో, శాకాహార జంతువుల సంఖ్యను సమస్థాయిలో ఉంచుతుంది. పులి జనాభాలో ఆకస్మిక తరుగుదల సంభవిస్తే, అది శాకాహార జంతువుల వృద్ధికి కారణమై, మొక్కల వినియోగం అధికమై అడవులు క్షీణిస్తాయి. ఆవరణ వ్యవస్థలో ఎన్నో జీవజాతులను కాపాడే జాతిగా పులికి పేరుంది. పర్యావరణ ఛత్రం కింద తనకు అనుసంధానమైన వాటన్నింటినీ సంరక్షిస్తుంది. పులి ఆవాసముండే అడవులు జీవవైవిధ్యానికి నెలవులు. వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి కల్పన, చేపల లభ్యత, పశుగ్రాసం, కలప, జిగురు, తునికి ఆకు, కర్బన శోషణ, నిల్వ, నీటి లభ్యత, నీటి వడపోత, మృత్తికా సంరక్షణ వంటి వాటన్నింటికీ పులులు జీవించే అడవులు ఆలవాలం. తుపానులు, వరదల వంటి ప్రకృతి విపత్తులనూ ఈ అడవులు నియంత్రిస్తాయి. పంటపొలాలకు నదుల ద్వారా నీటినందిస్తున్న ఈ అడవులు, రుతుసంబంధ వర్షాలను నియంత్రిస్తూ, మృత్తికల్నీ రక్షిస్తున్నాయి. ఇలాంటి అడవుల మనుగడ- కోట్లాది రైతుల సంక్షేమం, ప్రజల ఆహార భద్రతతో ముడివడి ఉంది.

అంతరాయం కలిగించవద్దు

దేశంలోని కార్బెట్‌, కన్హ, తడోబా, మదుమలై, బందీపూర్‌, రణతంబూరు తదితర జాతీయ పార్కులు, టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాలు పులి ప్రధాన ఆకర్షణగా ఉపాధినిస్తూ, ఆదాయన్నందిస్తూ పర్యావరణ పర్యాటకానికి పేరొందాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న అమ్రాబాద్‌, నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ అడవులు పులులకు నెలవులు. మహారాష్ట్ర తడోబా ఇతర రక్షిత ప్రదేశాల నుంచి పులుల వలస కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతోంది. క్రమంగా గతంలో పులి ఆవాసాలుగా ఉన్న ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి జరుగుతోంది. పులులు వలసరావడం, స్థిరపడటం, సంతతి వృద్ధి వంటివి అటవీ సంరక్షణ చర్యలు పెరిగాయనేందుకు సూచికగా భావించవచ్చు. పులి జీవన విధానం ప్రకారం దాని నిర్విఘ్న జీవనానికి, ప్రత్యుత్పత్తికి, ఆటంకం లేని ఆవాసాలు అవసరం. మనుషులు, పులులు ఒకే ఆవాసంలో కలిసి ఉండటం సాధ్యం కాదు. అభివృద్ధి కార్యకలాపాల పేరిట వాటి ఆవాసాలకు అంతరాయం కలిగించకూడదు. పులి వేటను, దాని ఆహార జంతువుల వధను నిరోధించాలి. అడవుల్ని కాపాడుతూ పులుల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి. పులుల సంరక్షణ కోసం వాటి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. సుశిక్షితులైన సిబ్బంది, వాహనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఇలాంటి చర్యలతోనే పులి రక్షణ సాధ్యమవుతుంది. అది ఆవరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుతుంది.

- ఎం.రామ్‌మోహన్‌ (అటవీ క్షేత్రాధికారి, ములుగు)


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.