
గ్రేటర్ హైదరాబాద్
కనీస మద్దతు ధర.. రైతుల హక్కు
ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా జరిగిన వేడుకల్లో రైతు నేతలు
దిల్లీ: ఎండకు ఎండి.. వానకు తడిచి.. చలికి వణికి.. సుదీర్ఘ పోరాటం చేసి.. చివరకు నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకొనేలా చేసిన రైతులు దిల్లీ సరిహద్దుల్లో తమ ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఆందోళనకు వేదికగా నిలిచిన సింఘు, గాజీపుర్, టిక్రిలకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. మిఠాయిలు పంచుకున్నారు. అదే సమయంలో తమ ఇతర డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని రైతు నేతలు స్పష్టం చేశారు. ‘‘సంతోషం, విచారం కలగలిసిన సాటిలేని పోరాటమిది. మేం పోరాటం చేశాం, గెలిచాం. కనీస మద్దతు ధర చట్టం.. రైతుల హక్కు’’ అని రైతు నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12 నెలలుగా జరిగిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే స్ఫూర్తితో మిగిలిన డిమాండ్లు సాధించేందుకు పోరాడతామని పేర్కొంది. ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో పండుగ వాతావరణం కనిపించింది. పంజాబ్ నుంచి తరలి వచ్చిన సిక్కు యువకులు బల్లే బల్లే నృత్యాలు చేశారు. ‘‘ఇదో ప్రత్యేకమైన రోజు. అందుకే పండుగలా జరుపుకొన్నాం’’ అని పటియాలాకు చెందిన 50 ఏళ్ల సరీందర్ చెప్పారు. ఉద్యమ తొలి రోజుల్లో పోలీసుల బారికేడ్లను, భద్రతా కవచాలను దాటుకొని దిల్లీ సరిహద్దులకు సైకిళ్లపైనా, ఇతర వాహనాలపైనా తాము ఎలా చేరుకున్నదీ కొందరు రైతులు గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 732 మందికి రైతులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
సాగుచట్టాలపై దిల్లీ అసెంబ్లీలో తీర్మానం
రైతుల ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలుపుతూ.. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ తీర్మానం చేసింది.