
తెలంగాణ
వనసేవకులు, సంరక్షకుల తొలగింపు
ఆందోళనలో బాధిత కుటుంబాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మొక్కల సంరక్షణ, నర్సరీలు, పల్లెప్రకృతి వనాల నిర్వహణలోని సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. ఉపాధిహామీ పథకం అమల్లో భాగంగా వంద రోజుల పని పూర్తయినందున వారిని ఇంటికి పంపించేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో తెలంగాణకు హరితహారం కింద ప్రభుత్వం మొక్కలు నాటుతోంది. వీటి సంరక్షణ కోసం ప్రతి 500 మొక్కలకు ఒక సంరక్షకుడు (వాచ్వార్డు), నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయడానికి, పల్లెప్రకృతి వనాల్ని కాపాడేందుకు వనసేవకులు పనిచేస్తున్నారు. ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు ఒక్కో గ్రామంలో 7 నుంచి 10 మంది వరకు ఈ సేవల్లో ఉన్నారు. ప్రభుత్వం వీరికి ఉపాధిహామీ కింద కూలీ అందిస్తోంది. ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున చెల్లిస్తోంది. గ్రామాల్లోని పేదరికంలోని కుటుంబాలు, బయట కూలి పనులకు వెళ్లలేని వారిని ఒప్పించి సర్పంచులు, కార్యదర్శులు ఈ పనుల్లో పెట్టారు. ఇప్పటివరకు వంద రోజుల పని పూర్తయినా అలాగే కొనసాగిస్తూ వేతనాలు చెల్లించారు. ఇటీవల వంద రోజుల పని పూర్తయిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆన్లైన్లోనూ మార్పులు జరిగాయి. ఒక్కసారిగా తొలగించడంతో పేద కుటుంబాలకు చెందిన కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.