
గ్రేటర్ హైదరాబాద్
ముషీరాబాద్, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఫలితంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడి కొలువులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు నర్సింహాగౌడ్, కృష్ణయాదవ్, రవితేజ, నాగమణి పాల్గొన్నారు.