
గ్రేటర్ హైదరాబాద్
విచారణ జరిపించాలని గవర్నర్కు సుపరిపాలన వేదిక లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ పనితీరు సరిగా లేదని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) విమర్శించింది. ఈ కమిషన్ గడిచిన ఏడేళ్లలో ఒక్క నివేదికనూ శాసనసభ ముందుంచలేదని గవర్నర్కు శుక్రవారం పంపిన లేఖలో వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ‘పాలనలో అవకతవకలను నిరోధించి ప్రభుత్వానికి సలహాలివ్వాలనేది కమిషన్ ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో అవినీతిపై కమిషన్ రూపొందించే నివేదికను గవర్నర్ ద్వారా శాసనసభలో సమర్పించాలి. కానీ ఇప్పటివరకు తెలంగాణ శాసనసభలో ఒక్క నివేదికనూ ఉంచలేదు. ఇదే విషయమై గత సెప్టెంబరు 18న చివరగా లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలు ఇచ్చిన అర్జీలపైకానీ, గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలపైగానీ ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి కదలికా లేదు. చివరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ పట్టించుకోవడంలేదు. డజన్లకొద్దీ కోర్టు ధిక్కరణ కేసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యదర్శులపై ఉన్నాయి. అవినీతిపై పత్రికల్లో వచ్చిన సమాచారాన్నీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలో విజిలెన్స్ నివేదికలు శాసనసభ ముందు ఎందుకు ఉంచలేదో విచారణ జరిపించాలి. విజిలెన్స్, రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికలను శాసనసభ ముందుంచేలా ఆదేశించాలి..’ అని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు.