Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
ఆధునిక పద్ధతుల్లో ధాన్యం నిల్వ

ఆహార భద్రతకు భరోసా

స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో భారతదేశం ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉండేది. తరచూ ఆహార దిగుమతులే శరణ్యమయ్యేవి. పదేపదే ఆహార కొరతలు చుట్టుముట్టేవి. అప్పట్లో 33 కోట్లుగా ఉన్న భారత జనాభా నేడు 138 కోట్లకు పెరిగింది. ఇంతటి అధిక జనాభా ఆహార అవసరాల డిమాండునూ దేశం తట్టుకోగలుగుతోంది. 1951లో అయిదు కోట్ల టన్నులుగా ఉన్న ఆహార ధాన్యం ఉత్పత్తి ప్రస్తుతం 25.7 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ కాలవ్యవధిలో గోధుమల ఉత్పత్తి 15 రెట్లు, బియ్యం ఉత్పత్తి అయిదు రెట్లు, మొక్కజొన్నల ఉత్పత్తి 14 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో అత్యధిక బియ్యం ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. గోధుమలను కూడా పెద్దయెత్తున ఎగుమతి చేస్తోంది. అయితే, అవసరాలకు మించి పండిస్తున్న ఆహార ధాన్యాలను నిల్వ చేయడమే పెద్ద సమస్యగా మారింది. మిగులు ఉత్పత్తిని శాస్త్రీయంగా, తక్కువ వ్యయంతో నిల్వ చేయడానికి సతమతమయ్యే పరిస్థితి నెలకొంది. పంట దిగుబడుల్ని మెరుగైన రీతిలో నిల్వ చేసే విషయంలో మరింత అధునాతన, శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన మరింతగా పెరగాలి.

కొరవడిన రక్షణ

ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యం నిల్వ సౌకర్యాలు ప్రధానంగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధీనంలో ఉన్నాయి. పైకప్పు కలిగిన గిడ్డంగులలో 382.27 లక్షల టన్నులను నిల్వచేసే సామర్థ్యం ఎఫ్‌సీఐకి ఉంటే, రాష్ట్ర సంస్థలకు 238.17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. భారత్‌ మొత్తం 620.44 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పైకప్పు కలిగిన పక్కా గిడ్డంగులలో నిల్వ చేయగలదు. ప్లాస్టిక్‌ కవర్లు, టార్పాలిన్ల వంటివి కప్పడం, నిర్మించిన పలకలు లేదా ప్లింత్‌లపై (క్యాప్‌ ప్లింత్‌) కూడా ఆహార ధాన్యాలను నిల్వ చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఎఫ్‌సీఐ 26.07 లక్షల టన్నులను, రాష్ట్ర సంస్థలు 106.09 లక్షల టన్నులను నిల్వ చేయగలవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వస్తున్న పంట దిగుబడులతో పోలిస్తే నిల్వ వసతిని పెంచాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రస్తుత వసతులు ఆహార ధాన్యాలను దీర్ఘకాలం నిల్వ చేయడానికి అనువుగా లేవు. పొలాల వద్ద పురుగులు, చీడల నుంచి రక్షణ కల్పించగల నిల్వ సౌకర్యాలకు తీవ్రమైన కొరత ఉంది. ఆధునిక గిడ్డంగులను నిర్మించే ప్రైవేటు సంస్థలకు పదేళ్లపాటు నికరంగా అద్దె చెల్లించి ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి 2008లో చేపట్టిన ప్రైవేటు వ్యవస్థాపకుల హామీ (పీఈజీ) పథకం కింద 149 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయదలచారు. అందులో ఇప్పటికే 142.83 లక్షల టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. 2017-18లో ఆహార ధాన్యాల నిల్వకు రూ.3,610 కోట్లు ఖర్చయితే, 2019-20కల్లా అది రూ.5,201 కోట్లకు పెరిగింది. ధాన్యాలను శాస్త్రీయ పద్ధతిలో నిల్వచేస్తే, అవి ఎగుమతిదారులకు నచ్చే నాణ్యతను కలిగి ఉంటాయి. అశాస్త్రీయ నిల్వ పద్ధతుల వల్ల ఏటా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నష్టమవుతున్నాయి. చేను దగ్గరి నుంచే పకడ్బందీగా నిల్వ చేయడం ద్వారా ఈ నష్టాన్ని అరికట్టాలి.

నిర్వహణ కీలకం

గిడ్డంగులలో వాతావరణ పరిస్థితులు సరైన రీతిలో ఉండకపోతే ఆహార ధాన్యాలకు బూజు, పురుగులు పట్టి వృథాగా మారతాయి. వాటి నాణ్యత కూడా దెబ్బతింటుంది. సరిగ్గా కప్పకపోవడం, అడుగున గచ్చు లేకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. గిడ్డంగుల్లో సరకు నిల్వ చేసే రైతులు అక్కడ రసీదు తీసుకుని కనీస మద్దతు ధరలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి అడ్వాన్సు తీసుకోవచ్చు. ఈ పద్ధతి రైతుకు, ప్రైవేటు రంగానికి, ప్రభుత్వానికి ప్రయోజనకరమైనది. పల్లె ప్రాంతాల్లో గోదాముల నిర్మాణం, నవీకరణకు పెట్టుబడి సబ్సిడీలను ఇచ్చే గ్రామీణ భండారన్‌ యోజన పథకాన్ని 2001-02లో ప్రారంభించారు. దీని కింద రైతులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, ప్రైవేటు కంపెనీలు, సహకార సంఘాలు గోదాములను నిర్మించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. దేశంలోని గిడ్డంగులను నిలువుగా ఎత్తయిన గొట్టాల రూపంలో ఉండే ‘సిలో’లుగా వ్యవహరించే ఆధునిక గోదాములుగా మారిస్తే, ధాన్యం నష్టాలను సమర్థంగా అరికట్టవచ్చు. పంట కోత తరవాత సేకరించే ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చూడటానికి లోహ సిలోలు ఎంతో ఉపకరిస్తాయి. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద కేంద్రం 2020-21లో సిలోల నిల్వ సామర్థ్యాన్ని 15 లక్షల టన్నులకు పెంచుతోంది. వీటి నిర్మాణాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. దేశమంతటా కోటి టన్నుల ఆహార ధాన్యాలను నిల్వచేయగల సిలోలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి భూ సేకరణ అడ్డువస్తోంది. ఎఫ్‌సీఐ గోదాములను లీజుకు తీసుకోవడం, క్యాప్‌ వంటి తాత్కాలిక నిల్వ పద్ధతులను అనుసరించడం వల్ల నిల్వ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎఫ్‌సీఐ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పాత గిడ్డంగులను ఆధునిక సిలో గిడ్డంగులుగా నిర్మించి సమర్థంగా నిర్వహించవచ్చు. ఆహార ధాన్యాలను మూడు నెలలకు మించి నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా చూడాలి. తద్వారా క్యాప్‌ నిల్వ పద్ధతికి దశలవారీగా స్వస్తి చెప్పి పొడవైన గొట్టాల్లా ఉండే ‘సిలో’ సంచుల పద్ధతికి మారాలి. రవాణా నష్టాలను నివారించడానికి ఆహార ధాన్యాలను కంటైనర్లలో తరలించాలి. ఇలాంటి ఆధునిక నిల్వ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆహార వృథాను అరికట్టగల వీలుంది.


అందరికీ అందని సదుపాయాలు

ప్రస్తుతం నాలుగు రకాల నిల్వ సౌకర్యాలు ఉన్నా రైతులందరికీ అవి అందుబాటులో లేవు. మొదటిది- జనపనార సంచుల్లో కూరిన ఆహార ధాన్యాలను పక్కా పైకప్పు కలిగిన గిడ్డంగులలో బస్తాలుగా పేర్చడం. ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు ఆహార ధాన్యాల నిల్వకు ప్రధానంగా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి; రెండోది- క్యాప్‌ ప్లింత్‌ (క్యాప్‌) పద్ధతి. ఇందులో ఆరు బయట ప్లాస్టిక్‌ కవర్ల కింద బస్తాలు పేర్చి నిల్వ చేస్తారు. ధాన్యం చెమ్మగిల్లకుండా సిమెంటు లేదా ఇటుకలతో పలకలు లేదా ప్లింత్‌ను నిర్మించి వాటిపై ధాన్యం బస్తాలను ఉంచి ప్రత్యేక ప్లాస్టిక్‌ కవర్లు కప్పుతారు. ఎలుకల నిర్మూలన వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు; మూడో పద్ధతి- ఎత్తయిన గొట్టాల్లాంటి ఆధునిక సిలో గోదాముల్లో ధాన్యాన్ని నిల్వచేయడం. సాధారణ గిడ్డంగులకన్నా 30శాతం తక్కువ స్థలంలోనే సిలోలను నిర్మించవచ్చు; నాలుగో పద్ధతి- పొడవైన గొట్టాల రూపంలో ఉండే ప్లాస్టిక్‌ సంచుల్లో (సిలో బ్యాగ్‌) ధాన్యాన్ని నిల్వ చేయడం. ఈ సంచులు ధాన్యాన్ని దుమ్మూధూళి, చెమ్మ, యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. ఈ పద్ధతిలో స్వల్పకాలికంగా అధిక పరిమాణంలో ఆహార ధాన్యాలను నిల్వ చేయవచ్చు.


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.