Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
వాహనాలకు మరణశాసనం

కొండనాలుక్కి మందేస్తే, అమాంతం ఉన్న నాలుక ఊడిపోకూడదు. అలా చేసేది చికిత్సే కాదు. దేశంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట కేంద్ర సర్కారు తలకెత్తుకున్న తుక్కు విధానం అదే బాపతుగా పరువు మాస్తోంది. దేశవ్యాప్తంగా 65 శాతం వాయుకాలుష్యానికి పదిహేనేళ్లకు పైబడిన భారీ వాహనాలే పుణ్యం కట్టుకుంటున్నాయన్న విశ్లేషణలు అయిదారేళ్లనాడే వెలుగుచూశాయి. ఆ లెక్కన ‘ఆయువు తీరిన’ రెండుకోట్ల ఎనభై లక్షల వాహనాలను తుక్కుగా పరిగణించాలన్న ప్రతిపాదనకు మూడున్నరేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది. అలా చేస్తే వాయుకాలుష్య నియంత్రణ ఒక్కటే కాదు- ఆటొమొబైల్‌ పరిశ్రమకు నూతన జవసత్వాలు చేకూరతాయని, రూ.10వేలకోట్లదాకా కోశాగారానికి రాబడి తథ్యమని రవాణా శాఖామాత్యులు నితిన్‌ గడ్కరీ గట్టిగా సమర్థించారు. రాష్ట్రాలతో సంప్రతింపులు, తెరచాటు మంతనాల దరిమిలా- తుక్కు విధానం అమలుపై ఆయన ఇటీవల ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం- పదిహేనేళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడంలో విఫలమైతే 2023 సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి వాటి రిజిస్ట్రేషన్‌ రద్దయిపోతుంది. ఇరవైఏళ్లకు మించి వాడకంలో ఉన్న వ్యక్తిగత వాహనాలకూ 2024 జూన్‌ నుంచి అదే షరతు వర్తిస్తుంది. నిర్దిష్ట కాలానంతరం వాహనదారులందరూ ఇకమీదట ప్రత్యేక సుంకం చెల్లించాల్సిందేనని ఈ ఏడాది మొదట్లో చేదుకబురు వినిపించిన కేంద్రం- పాత వాహనాలపై ఛార్జీల వాతలు ఏ స్థాయిలో తేలనున్నాయో ఏడు వారాలక్రితం సెలవిచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం పునరుద్ధరణ కోసం ద్విచక్ర వాహనానికైతే రూ.300, కారుకైతే రూ.600 వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనానికి వెయ్యి, కారుకు అయిదు వేల రూపాయలుగా నిర్ధారించిన కొత్త ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్నాయంటున్నారు. ట్రక్కు లేదా బస్సు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రం పునరుద్ధరణ రుసుమును రూ.15వందలనుంచి ఎకాయెకి పన్నెండున్నర వేల రూపాయలకు పెంచేశారు. కొవిడ్‌ మహాసంక్షోభం ధాటికి భిన్నరంగాలు కుంగిపోయి, దేశార్థికమే చతికిలపడిన వేళ ఇంతగా ఛార్జీల బాదుడు అమానుషం. తుక్కు విధానంలో భాగంగా పాతకారును తీసేయదలచినవారికి లక్ష, లక్షన్నర రూపాయల దాకా రాయితీలు ముట్టజెప్పడం సముచితమని కేంద్ర అమాత్యులు గడ్కరీ పిలుపిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో అయితే గియితే దక్కుతాయంటున్న రాయితీలకు ఆశపడి పాత వాహనాల్ని వదిలిపెట్టి కొత్తవి కొనుగోలు చేయగల ఆర్థిక స్థోమత దేశప్రజానీకంలో ఎందరికుంది?

వచ్చే రెండేళ్లలో 200-300 తుక్కు కేంద్రాలను దేశంలో నెలకొల్పుతామంటున్న గడ్కరీ, అయిదేళ్లలో వాహన పరిశ్రమ వార్షిక టర్నోవరు రెండింతలై రూ.15లక్షల కోట్లకు ఎగబాకుతుందని చిటికెల పందిళ్లు వేస్తున్నారు. కొత్తగా ఉపాధి అవకాశాలు విస్తరించి, అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకు చెరో రూ.40వేలకోట్ల మేర జీఎస్‌టీ (వస్తు సేవా సుంకం) వసూళ్లు పెరుగుతాయంటూ ఆయన వల్లెవేస్తున్నవి- క్షేత్రస్థాయి వాస్తవాలు విస్మరించి చెబుతున్న కాకిలెక్కలు! అమెరికాలో అమలుపరచిన ‘కార్స్‌’ (కార్‌ అలవెన్స్‌ రిబేట్‌ సిస్టమ్‌) తరహాలో రాయితీల ప్రదానం ఇక్కడి తుక్కు విధానాన్ని జయప్రదం చేస్తుందన్న ధీమా మంత్రివర్యుల్లో ఉట్టిపడుతోంది. ఫ్రాన్స్‌, జపాన్‌, యూకే లాంటిచోట్లా పాత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తవి కొనదలచినవారికి వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడం పరిపాటి. పాశ్చాత్యదేశాలు, సంపన్న రాజ్యాల్లో చెల్లుబాటయ్యే వినిమయ సంస్కృతికి, భారతీయ స్థితిగతులకు ఎక్కడా పొంతన కుదరదు. పొదుపు చేసి, ఖర్చులు తగ్గించుకుని, రేపటి తరానికి వారసత్వంగా ఎంతో కొంత మేర ఆస్తిపాస్తులు సంక్రమింపజేయడమే లక్ష్యమైన జీవన సంస్కృతి ఇక్కడిది. ఒకప్పుడు తాత, తండ్రి వాడిన సైకిల్‌ సైతం మనవడికి దఖలుపడేది. ఇప్పటికీ అసంఖ్యాక కుటుంబాల్లో కారైనా, భారీ వాహనమైనా... వారికది జీవితకాల పెట్టుబడి. వాహనం మోడల్‌ పాతబడి మోజు తీరగానే దాన్ని వదిలించుకుని మరొకటి కొనుగోలు చేయాలన్న ఆలోచన, స్థోమత లేని సామాన్యులు కోట్ల సంఖ్యలో ఉన్న భారత్‌లో- తుక్కు ప్రతిపాదనే అసంబద్ధం!

కాలం చెల్లినవనే ముద్రవేసి వాహనాన్ని తిరుగాడకుండా చేయాలన్న ప్రతిపాదనలకు ఆద్యులు గడ్కరీ కాదు. గతంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా తదితర నగరాల్లో పాలన యంత్రాంగాలు ఈ యోచన వ్యక్తపరచినప్పుడు పెద్దయెత్తున ప్రజాగ్రహం పోటెత్తింది. నాటి అనుభవాల్ని కూలంకషంగా పరిశీలించాకనే తుక్కు ప్రణాళిక రచనకు ఉద్యుక్తం కావాల్సిన కేంద్రం, మౌలికాంశాల్నీ గాలికి వదిలేయడం విస్మయపరుస్తోంది. ఎన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారన్నదాన్నిబట్టి వాహనాల వినియోగ యోగ్యతను ఎలా నిర్ధారిస్తారు? ఎంత దూరం తిరిగారన్న ప్రాతిపదికన వాహనం అరుగుదలను లెక్కించాలి. ఏ ప్రాంతంలో ఎటువంటి రహదారులపై వినియోగిస్తున్నారు, డ్రైవర్‌ నైపుణ్యం, నిర్వహణ తీరుతెన్నులు... తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం విధిగా అమలుపరుస్తామంటున్న తుక్కు విధానం రూపకల్పన ప్రక్రియలో ఏ దశలోనూ ఆ మేరకు సరైన కసరత్తు చేపట్టిన దాఖలాలు లేవు. కొనుగోలు తేదీనిబట్టి వాహనం గడువు తీరిందంటూ భారీగా ఛార్జీల వడ్డనతో మోతెక్కించడానికే ప్రభుత్వం సిద్ధపడితే- ప్రజా వ్యతిరేకత తప్పదు.

వాహనాల నుంచి వెలువడే పొగలో సుమారు వెయ్యి రకాల రసాయనాలు ఉంటాయని అంచనా. వాటివల్ల ప్రజారోగ్యానికి, స్థూల ఉత్పాదకశక్తికి, పంట దిగుబడులకు వాటిల్లుతున్న నష్టాన్ని అరికట్టేలా కాలుష్య నియంత్రణ వ్యూహాలు పదును తేలాల్సిందే. ఈ కీలక సమస్యను పరిష్కరించడానికి అడ్డగోలు హరిత సుంకాల పేరిట పౌరుల నడ్డి విరగ్గొట్టడం, వాహనాలకు మరణ శాసనం లిఖించి తీవ్ర జనాగ్రహానికి గురికావడం- సరైన పద్ధతులు కావు. వాహన కాలుష్యాన్ని మెరుగ్గా నియంత్రించి, వాటి ఆయుర్దాయాన్ని పెంపొందించే పరిశోధనల్ని ప్రభుత్వం విరివిగా ప్రోత్సహించాలి. పోనుపోను వాహనాల సంఖ్య పెరుగుతున్నా, వాయు కాలుష్యాన్ని చాలావరకు కట్టడి చేయడమెలాగో క్యాలిఫోర్నియా సోదాహరణంగా తెలియజెబుతోంది. వ్యక్తిగత వాహనాలను పరిమితంగా అనుమతిస్తూ ప్రజారవాణా వ్యవస్థను పరిపుష్టీకరించడంలో సింగపూర్‌ది మేలిమి ఒరవడి. ఆరోగ్యకర వాహన సంస్కృతిని సంరక్షించడంలో ఐస్‌లాండ్‌, కెనడా, ఫిన్లాండ్‌, ఎస్తోనియా ప్రభృత దేశాలు పోటీపడుతున్నాయి. మరెన్నో దేశాలు విద్యుత్‌ వాహనాలకు బాటలుపరుస్తూ, కాలుష్య నియంత్రణ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

అందుకు విరుద్ధంగా ఇక్కడ- నిర్ణీత కాలావధి ముగియగానే వాహనాల్ని తుక్కుగా జమకట్టే విధానాన్ని పట్టాలకు ఎక్కిస్తే, జరిగేదేమిటి? లారీలు, వ్యాన్లు, ట్యాక్సీలు, ఆటోలు భారీ సంఖ్యలో మూలన పడితే... కోట్లాది బతుకులు దుర్భర పేదరికంలోకి జారిపోతాయి. గత్యంతరం లేక బలవంతాన వ్యక్తిగత వాహనాల్ని వదులుకోవాల్సి రావడం మధ్యతరగతి ప్రజానీకంలోనూ అసమ్మతి చిచ్చు రగిలించక మానదు. కాలుష్య ధూమాన్ని అరికట్టేందుకంటూ పసలేని తుక్కు విధానాన్ని నెత్తికెత్తుకోవడమన్నది విజ్ఞతాయుత నిర్ణయం కానేకాదు. ఏమంటారు?

- బాలు


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.