
తెలంగాణ
త్వరలో ప్రారంభం...నోడల్ సంస్థగా ఓయూ
విద్యార్థులకు ఉద్యోగావకాశాల పెంపే లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: గతేడాది రాష్ట్రంలోని 124 డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు వేగవంతం చేసింది. డేటా సైన్స్ బోధించే అధ్యాపకులకు టీసీఎస్ అయాన్ సంస్థతో శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ సంస్థతో గత ఏడాదే అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఆ కోర్సులో చేరిన విద్యార్థులు ప్రస్తుతం మూడో సెమిస్టర్‌లోకి ప్రవేశించారు. అందుకే ఇటీవల విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి టీసీఎస్ అయాన్ అధికారులతో రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి శిక్షణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
వారం రోజులపాటు శిక్షణ
అధ్యాపకులకు వెంటనే వారం రోజులపాటు శిక్షణ మొదలుపెట్టాలని టీసీఎస్ ప్రతినిధులను, ఓయూ అధికారులను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఒక్కో కళాశాల నుంచి ఇద్దరు అధ్యాపకులు పాల్గొంటారు. గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ సబ్జెక్టులపై టీసీఎస్ నిపుణులు శిక్షణ ఇస్తారు. కంప్యూటర్‌పై ప్రయోగాలు కూడా చేయిస్తారు. దానివల్ల వారు విద్యార్థులకు ప్రభావవంతంగా బోధిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత అధ్యాపకులతోపాటు విద్యార్థులకూ కొన్ని అంశాలపై టీసీఎస్ నిపుణులు ఆన్లైన్ ద్వారా బోధన చేపడతారు. అత్యధిక కళాశాలలు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉన్నందున ఆ వర్సిటీనే నోడల్ సంస్థగా ఉన్నత విద్యామండలి ఎంపిక చేసింది. ఉన్నత విద్యామండలి, టీసీఎస్ అయాన్, కళాశాలల మధ్య అనుసంధానం కోసం ఓయూలోని స్టాటిస్టిక్స్ విభాగానికి సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఉన్నత విద్యామండలి ఓయూను ఆదేశించింది.
* ‘ఈ కోర్సును సమర్థంగా నిర్వహిస్తే బీటెక్ డేటా సైన్స్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. టీసీఎస్ శిక్షణ కారణంగా కంపెనీలు కూడా ప్రాంగణ నియామకాలకు ఆసక్తి చూపుతాయి’ అని ఓయూ గణితం ఆచార్యుడు కిషన్ అభిప్రాయపడ్డారు.