
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరోనా నుంచి కోలుకోవడంతో వైద్యులు ఆయనను శనివారం ఇంటికి పంపించారు. ఈ నెల 24న కరోనా నిర్ధారణ అవడంతో ఆయన ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు అనుమతించిన వైద్యులు.. కొన్ని రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని పోచారానికి సూచించారు.
కొత్తగా 160 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 160 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,479కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు కన్నుమూశారు. ఇప్పటి వరకు కొవిడ్‌తో 3,988 మంది మరణించారు.
మరో 77 మంది వైద్య విద్యార్థుల్లో వైరస్ లక్షణాలు
ధార్వాడ, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం ధార్వాడలోని ఎస్డీఎం వైద్య కళాశాలలో శనివారం జరిపిన వైద్య పరీక్షల్లో మరో 77 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు వెల్లడైంది. నాలుగు రోజుల వ్యవధిలో ఇప్పటివరకు మొత్తం 281 మందికి కరోనా సోకినట్లు తేలింది.
ఒడిశాలో 26 మంది విద్యార్థినులకు కొవిడ్
కటక్, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని చమకాపురి ఆదివాసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు.