
తెలంగాణ
ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈనాడు, హైదరాబాద్: ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో తెరాస ఆందోళనబాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంటు లోపల, బయటా నిరసన వ్యక్తం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెరాస తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే విభజన హామీలను అమలు చేయకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, ప్రోత్సాహకాలు లేకపోవడం వంటివాటిపై ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. ధాన్యం కొనుగోళ్ల ధోరణిపై ఆందోళన చెందుతోంది. గత యాసంగిలో బియ్యం సేకరణకు హామీ ఇచ్చిన దానిలో 5 లక్షల టన్నులను ఇంకా సేకరించలేదు. తాజాగా వర్షాకాలంలో ధాన్యం సేకరణ లక్ష్యాలను నిర్దేశించలేదు. వచ్చే యాసంగిపైనా స్పష్టత లేదు. దీంతో ఈనెల 12న అధికార పార్టీ ధర్నాలు నిర్వహించింది. అందులో కేసీఆర్ స్వయంగా పాల్గొని కేంద్రపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అనంతరం మంత్రుల బృందంతో కలసి దిల్లీ వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్ర మంత్రులను కలసి చేపట్టిన చర్చలు ఫలవంతం కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిని ఎండగడుతూ పార్లమెంటులో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని తెరాస భావిస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్రం ఒకవిధానం అవలంబిస్తుండగా. రాష్ట్ర భాజపా నేతలు దానికి భిన్నంగా వ్యవహరించడం, సేకరణకు పంజాబ్లో ఒకతీరు, ఇతర రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేయడం వంటి వాటిని సైతం వివరించనున్నారని తెలుస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్ర విధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండు చేయనుంది.