
తెలంగాణ
రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర వ్యవసాయ మంత్రి
మద్దతుధరపై అధ్యయనానికి కమిటీ
దిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం సోమవారమే బిల్లు ప్రవేశపెట్టనుంది. అదే రోజున పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అజెండాలోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు చోటు దక్కింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభం రోజున తప్పకుండా హాజరు కావాలంటూ భాజపా, కాంగ్రెస్‌లు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. కనీస మద్దతు ధర అమలుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
బిల్లు లక్ష్యాలపై కాంగ్రెస్ అభ్యంతరం
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ‘లక్ష్యాలు-కారణాల’పై కాంగ్రెస్ విమర్శించింది. చట్టాలకు వ్యతిరేకంగా చాలా తక్కువ మంది రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ, సమ్మిళిత అభివృద్ధి సాధనకు అందర్నీ కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో వాటిని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకు కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అభ్యంతరం తెలిపారు. ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు ప్రాణ త్యాగం చేస్తే దానిని గుర్తించకుండా, కేవలం కొంతమంది రైతులే వ్యతిరేకిస్తున్నారని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
ట్రాక్టర్ల ప్రదర్శన రద్దు
సోమవారం పార్లమెంటు వరకు ట్రాక్టర్ల ప్రదర్శన జరపాలన్న నిర్ణయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా రద్దు చేసుకుంది. డిసెంబరు నాలుగో తేదీన జరగనున్న భేటీలో తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నాయకుడు ధర్మేంద్ర మాలిక్ ‘ఈటీవీ భారత్’కు చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించడంతో పాటు, మరో అయిదు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి రాసిన లేఖపై సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మరో రైతు నాయకుడు రాజ్వీర్ జదౌన్ మాట్లాడుతూ ప్రభుత్వం మీడియాతో మాట్లాడే బదులు రైతు సంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించాలని అన్నారు. ఆదివారం ముంబయిలో దాదాపు 100 రైతు సంఘాలు కలిసి కిసాన్-మజ్దూర్ మహాపంచాయత్‌ను నిర్వహించనున్నాయి.
రైతులు ఇళ్లకు వెళ్లాలి : తోమర్
కనీస మద్దతు ధరల అమలుపై అధ్యయానికి ప్రధాని కమిటీని నియమించారని మంత్రి తోమర్ చెప్పారు. ఈ కమిటీలో రైతు ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ అంశంపై డిమాండు నెరవేరినందున ఆందోళనను విరమించి ఇళ్లకు వెళ్లాలని రైతుల్ని కోరారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించకూడదని రైతులు కోరారని, అందుకు కూడా ప్రభుత్వం సమ్మతించిందని తెలిపారు.