
తెలంగాణ
అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ
తాజా పరిశోధనలో వెల్లడి
లండన్: వ్యాయామం వల్ల శారీరకంగానే కాక మానసికంగానూ బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసు మీదపడే కొద్దీ మెదడు సక్రమంగా పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. అల్జీమర్స్ వంటి నాడీ క్షీణత వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఇది కీలకమవుతుందన్నారు. వాస్తవానికి వ్యాయామాలతో మెదడుకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటికే వెల్లడైనప్పటికీ.. నిర్దిష్టంగా ఇది ఎలా జరుగుతుందన్న దాని గుట్టును ఇప్పుడు శాస్త్రవేత్తలు విప్పారు. శారీరక శ్రమ వల్ల మెదడులోని రోగ నిరోధక కణాల చర్యల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల మెదడులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మెదడులో మైక్రోగ్లియా అనే ఒక రకం రోగ నిరోధక కణాలు ఉంటాయి. అవి నిరంతరం మెదడు కణజాలాన్ని శోధిస్తుంటాయి. దెబ్బతిన్న భాగాలు, ఇన్ఫెక్షన్ వంటి వాటి కోసం పరిశీలిస్తుంటాయి. వ్యర్థాలు, మృతకణాలను తొలగిస్తుంటాయి. కొత్త నాడీ కణాల (న్యూరాన్ల) ఉత్పత్తికి ఆదేశాలు ఇస్తుంటాయి. ఈ నాడీ కణాలు ‘న్యూరోజెనిసిస్’ అనే ప్రక్రియ ద్వారా సందేశాలను పంపుతుంటాయి. మైక్రోగ్లియా క్రియాశీలం కావాలంటే రోగ కారక సూక్ష్మజీవులు లేదా దెబ్బతిన్న కణాల నుంచి సంకేతాలు రావాల్సి ఉంటుంది. తద్వారా అవి ఇన్ఫ్లమేటరీ రేణువులను విడుదల చేసి, వాటి సాయంతో మరమ్మతులు నిర్వర్తిస్తాయి. అయితే వయసు మీదపడే కొద్దీ మైక్రోగ్లియా పొరపాటున కూడా క్రియాశీలమవుతుంటుంది. దీనివల్ల మెదడులో దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది. నాడీ కణాల మధ్య సమాచార బట్వాడా దెబ్బతింటుంది. వృద్ధాప్యంలో మెదడు సామర్థ్యం క్షీణించడానికి ఈ ఇన్ఫ్లమేషనే కారణమని చెబుతుంటారు. ఇలా మైక్రోగ్లియల్ క్రియాశీలం కావడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో వ్యాయామం దోహదపడుతుందని గతంలో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో వెల్లడైంది. మానవుల్లో శారీరక శ్రమ, మైక్రోగ్లియల్ క్రియాశీలత, మెరుగైన విషయ గ్రహణ సామర్థ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తాజాగా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. షికాగోలోని రష్ విశ్వవిద్యాలయం నిర్వహించిన దీర్ఘకాల ప్రాజెక్టులోని డేటాను పరిశీలించి, ఈ మేరకు తేల్చారు. వ్యాయామాల వల్ల మెదడులోని ‘ఇన్ఫీరియర్ టెంపోరల్ జైరస్’ వంటి ప్రాంతాల్లో మైక్రోగ్లియల్ క్రియాశీలత తగ్గుతున్నట్లు వెల్లడైంది. జ్ఞాపకశక్తి, పాత విషయాన్ని గుర్తుచేసుకోవడం వంటి అంశాలతో ఈ భాగాలు ముడిపడి ఉన్నాయి. మెదడులో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు మొదలయ్యాక కూడా వ్యాయాయాలతో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ దశలోనూ ఇన్ఫ్లమేషన్ వల్ల మెదడుకు జరుగుతున్న హానిని తగ్గించుకోవచ్చని వివరించారు.