
తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 30 నిర్మాణాల పరిశీలన
ఈనాడు, వరంగల్: రాష్ట్రంలో కేంద్ర పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరిధిలో ఉన్న కట్టడాలు ఎనిమిది మాత్రమే. హైదరాబాద్‌లో రెండు, ఉమ్మడి వరంగల్‌లో మూడు, పూర్వ ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో కేవలం ఒక్కో కట్టడం ఏఎస్ఐ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సంరక్షణలో ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో అలా ఒక్కటీ లేదు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఈ విషయంపై దృష్టి సారించారు. ఏఎస్ఐ పరిధిలోకి వీలైనన్ని కట్టడాలను తీసుకువచ్చేందుకు సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో 30 కట్టడాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
తాజా పరిశీలన..
ఉమ్మడి వరంగల్ పరిధి ములుగు జిల్లాలోని దామెరవాయి సమాధులు, భూపాలపల్లిలోని పాండవుల గుట్ట, చిట్యాల మండలంలోని నైన్పాక సర్వతోభద్ర ఆలయం, వరంగల్ జిల్లా ఖానాపూరం మండలంలోని త్రికూటాలయం, అశోక్‌నగర్‌లోని కోట, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పిరినాథస్వామి ఆలయంతో కలిపి ఆరు చారిత్రక ప్రదేశాలను అధికారులు తాజాగా గుర్తించారు. వాటిని కేంద్ర పురావస్తు పర్యవేక్షక అధికారిణి స్మితా ఎస్.కుమార్ పరిశీలించారు. కేంద్ర పురావస్తు సంరక్షణలోకి ఒక కట్టడాన్ని తీసుకోవాలంటే దానికి వంద మీటర్ల చుట్టూ ఎలాంటి ఇతర నిర్మాణాలు, ఆక్రమణలు ఉండకూడదు. ఈ క్రమంలో ఏఎస్ఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చారిత్రక ఆలయాలు, కోటలను అధికారులు సర్వే చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని ఆకారం సూర్యదేవాలయం, శాలిగౌరారం శివాలయంతోపాటు, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని కట్టడాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏఎస్ఐ సంరక్షణలో 129 కట్టడాలున్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో లేని కట్టడాలనే ఏఎస్ఐ పరిగణనలోకి తీసుకుంటుంది.