
ఆంధ్రప్రదేశ్
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
సారవకోట, న్యూస్టుడే: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మళ్లీ తానే పోటీ చేస్తానని, 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల పరిషత్తు సమావేశ భవనంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మనసున్న, చిత్తశుద్ధి గల నాయకుడు జగన్మోహన్రెడ్డి అని, ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుస్తానని తెలిపారు. గౌరవం కోసమే రాజకీయ పదవులని, ఉన్నత లక్ష్యంతో అందరూ పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎన్నికల్లో వరుస వైఫల్యాలతో చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడితే గౌరవం పెరుగుతుంది తప్ప, అనవసర రాద్ధాంతాలు చేస్తే ఏ ప్రయోజనమూ ఉండదన్నారు.