
తెలంగాణ
ఈనాడు, దిల్లీ: ‘అమరావతిని రాజధానిగా అంగీకరించిన వారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేశారు. ఇప్పుడు ఆ బిల్లులు ఉపసంహరించుకోవడంతో అనిశ్చితి ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గట్టిగా సిఫారసు చేయాలి’ అని కోరినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. లేకుంటే రాష్ట్రప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన విషయాలను ఆయన విలేకరులకు వివరించారు. శాసనసభలో తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సభలో లేవనెత్తుతామన్నారు.