
తెలంగాణ
వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సిద్ధం
సీఎం ఆమోదించాక ఈఆర్సీకి సమర్పించే యోచన
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022-23)కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదికను సిద్ధం చేశాయి. వచ్చే ఏడాది ఆదాయం, వ్యయం మధ్య లోటు రూ.10 వేల కోట్లకుపైగా ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఈ నివేదికతోపాటు రానున్న ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు, తగ్గింపునకు సంబంధించిన ఛార్జీల సవరణ ప్రతిపాదనలనూ డిస్కంలు నవంబరు 30లోగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అందజేయాలి. సీఎం కేసీఆర్ ఆమోదించిన తరవాత వీటిని ఈఆర్సీకి సమర్పించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఛార్జీల పెంపు తప్పదా..?
బొగ్గు, సహజ వాయువు ధరల పెరుగుదలకు అనుగుణంగా విక్రయ ధరలను పెంచవచ్చని ఇటీవల కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనుమతించింది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన కరెంటును తెచ్చుకోవడానికి వినియోగించే విద్యుత్ లైన్ల రవాణా ఛార్జీలనూ 7 శాతం వరకూ పెంచుకోవడానికి అనుమతించింది. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వినియోగించే బొగ్గు కొనుగోలు వ్యయం ఈ ఏడాది అదనంగా రూ.450 కోట్ల వరకు పెరుగుతున్నట్లు తేలింది. పెరుగుతున్న విద్యుదుత్పత్తి వ్యయాన్ని డిస్కంలు వినియోగదారుల నుంచే కరెంటు ఛార్జీల రూపంలో వసూలు చేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగదారులకు యూనిట్ కరెంటు సరఫరా చేసే సగటు వ్యయం రూ.7.14 అవుతున్నట్లు అంచనా. ఇంతమొత్తం సొమ్ము ఛార్జీల రూపంలో డిస్కంలకు రావడం లేదు. ఈ లోటు పూడ్చడానికి రాయితీ నిధుల కోటాను పెంచాలని, లేనిపక్షంలో వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పదని డిస్కంలు ప్రభుత్వానికి తెలిపాయి.