తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
Azadi Ka Amrit Mahotsav: మీ తుపాకీ గుండు... నా బోడిగుండు!

ఆంధ్రావనిలో బ్రిటిష్‌పై పోరాటం అనగానే చప్పున ప్రకాశం పంతులు గుర్తుకొస్తారు... కాల్చండంటూ పోలీసులకు ఛాతీ చూపించిన ఆయన సాహసం జ్ఞప్తికొస్తుంది. అలాంటి సాహసమే చేసిన విస్మృత వీరనారి... కోటమర్తి కనకమహాలక్ష్మి.

సహాయ నిరాకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా శృంగవృక్షంలో ఓ సాయంత్రాన సభ జరుగుతోంది. సుమారు మూడువేల మంది ప్రజలనుద్దేశించి... ఓ వితంతువు తెల్లటి ఖాదీ వస్త్రాన్ని తలపై  ధరించి అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. పద్యాలు, శ్లోకాలు, రామాయణ, మహాభారతాల్లోని ఉపమానాలను స్వాతంత్య్రోద్యమానికి అన్వయిస్తూ... బ్రిటిష్‌ ప్రభుత్వ దురాగతాలను ఎండగడుతూ... ప్రజల్ని ఉత్తేజపరుస్తున్న వేళ... పోలీసులు  చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం. సామాన్య ప్రజల్ని పోలీసులు ఏమీ చేయకముందే ఆమె తెలివిగా వారి దృష్టినంతటినీ తనవైపునకు మళ్లించారు. ‘పోలీసులను చూసి బెదరకండి. వారూ మన సోదరులే’ అంటూ ‘ఇన్‌స్పెక్టర్‌... మీ తుపాకీ గుండు గట్టిదో... నా బోడిగుండు గట్టిదో చూద్దాం రండి’ అంటూ నెత్తిపై వస్త్రాన్ని తొలగించి... తల ముందుకు వంచారు. ఏం చేయాలో తోచని పోలీసులు కనక మహాలక్ష్మిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. 6 నెలల పాటు కారాగారశిక్ష విధించి... వేలూరు జైలుకు తరలించారు.

భీమవరం తాలూకాలోని గునుపూడి గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబంలో 1860 సెప్టెంబరు 30న 14వ సంతానంగా జన్మించారు కనకమహాలక్ష్మి. చిరుప్రాయంలోనే అదే గ్రామానికి చెందిన కోటమర్తి సూర్యనారాయణ మూర్తికి రెండో భార్యగా వెళ్లాల్సి వచ్చింది. భర్త నుంచి శృత పాండిత్యం అబ్బిన ఆమెకు 30 ఏళ్లకే ఆరుగురు సంతానంతో పాటు వైధవ్యం ప్రాప్తించింది. ఒంటరి జీవన పోరాటం సాగించిన ఆమె... ఆనాటి సామాజిక అవలక్షణాలపైనా పోరాటం చేశారు. ఒకవైపు పిల్లలను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దుతూనే... స్వాతంత్య్రోద్యమంలో భాగమయ్యారు. చరఖాపై నూలు తీస్తూ... ఖద్దరు ధరించి ఇంటింటికీ వెళ్లి ఖద్దరు విక్రయించేవారు. హరిజనవాడలకు వెళ్లి పిల్లలకు స్వయంగా స్నానాలు చేయించి శుచి, శుభ్రత నేర్పేవారు. రోగులకు దగ్గరుండి సపర్యలు చేసేవారు. ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే... బోగీలోని నిండు చూలాలైన హరిజన యువతికి పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను పక్క స్టేషన్‌లోనే దింపి చెట్టుకిందే... తన వద్ద ఉన్న చీరను అడ్డుగా పెట్టి... పురుడు పోసి... సామాజిక సేవను చాటుకున్నారు కనకమహాలక్ష్మి. చురుకుదనం, ఉత్సాహం, నిబద్ధత కారణంగా ఆమె పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమ ప్రచార ప్రబోధకురాలిగా నియమితులయ్యారు. మరింత బాధ్యతతో అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు. యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలపై కనకమహాలక్ష్మిని అరెస్టు చేసి... 1932లో ఏడాది పాటు కారాగారశిక్ష విధించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగం చేసినందుకు నిరసనగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మరో ఆరునెలలు జైలులో గడపాల్సి వచ్చింది.


స్వాతంత్య్రం వచ్చాక కూడా... ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. 1952లో స్వామి సీతారాం భీమవరంలో సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే... కనకమహాలక్ష్మి ఏడురోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠిన నిరాహార దీక్ష చేశారు. నెహ్రూతో సంప్రదింపులకు దిల్లీ వెళ్లారు కూడా! సామాజికంగా, కుటుంబపరంగా కష్టాలు ఎదురైనా... వాటన్నింటినీ దాటుకుంటూ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఈ అచ్చతెలుగు స్వాతంత్య్ర సమరయోధురాలు 1962 జనవరి 12న 102వ ఏట కన్నుమూశారు.


- రామోజీ విజ్ఞాన కేంద్రం


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.