తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆ 6 జిల్లాలపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలి.. కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వార్తల నేపథ్యంలో కార్యాచరణ, సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ‘‘రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఆదిలాబాద్‌, కుమరం భీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

2. వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం: సీఎం జగన్‌కు వివరణ ఇచ్చిన కేంద్ర బృందం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్‌తో ఇవాళ భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని గురించి సీఎం జగన్‌కు బృందం వివరించింది. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర బృందం తరఫున కునాల్‌ సత్యార్థి సీఎం జగన్‌కు వివరాలు వెల్లడించారు.

3. సీఎం కేసీఆర్‌ మొండి వైఖరితో రైతులకు నష్టం: కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు.. మరోసారి వరి వద్దన్నారు.. వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. 

4. జగన్‌ తీరు.. అప్పులతో ఏపీ బ్రాండ్‌ దెబ్బతింటోంది: చంద్రబాబు

ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. 

5. కేంద్రం జాతీయ ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి: తెరాస ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం జాతీయ ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు వాయిదా పడిన అనంతరం తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

6. సమ్మె బాటలో స్విగ్గి డెలివరీ బాయ్స్

స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్డర్లు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరలతో ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. స్విగ్గి యాజమాన్యం గతంలో లాగా మినిమం బేస్ ఫెయిర్‌ను రూ.35 చెల్లించాలని, దూర ప్రాంత డెలివరీలకు ఇప్పుడు ఇస్తున్న రూ.6ను రూ.12కు పెంచాలని కోరుతున్నారు.

7. అరగంటలో సూచీల్లో ఒమిక్రాన్‌ ఆందోళన మాయం!

ఈరోజు ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలను వెంటాడిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంటలోపే సూచీలు ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చేశాయి. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంలో భారత మార్కెట్లపై మదుపర్లు బుల్లిష్‌గా ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వల్ల కొనుగోళ్ల తాకిడి పెరిగింది. దీంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.

8. సాగుచట్టాల రద్దు.. ఒకేరోజు ఉభయసభలు ఆమోదం!

సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యసభలోనూ ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దీనిపై చర్చ జరగాలని రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్‌ అనుమతించలేదు. అనంతరం మూజువాణి పద్ధతిలో సాగు చట్టల రద్దుకు సంబంధించిన మూడు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

9. రాజ్యసభలో 12మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్‌ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

10. IND vs NZ: తొలి టెస్టు డ్రా..

కాన్పూర్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్‌ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్‌ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్‌ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్‌ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది.

సైనికాధికారులతో జిన్‌పింగ్‌ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!
 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.