
ఫీచర్ పేజీలు
రమణ మహర్షి అరుణాచలంపై నివసించేవారు. అప్పుడక్కడ నీళ్లకి ఇబ్బందిగా ఉండేది. గడ్డికోసుకోవటానికి వచ్చే మహిళలు నీళ్లకోసం యాతన పడేవారు. కాళ్లు బొబ్బలెక్కేలా తిరిగితే మోపెడు గడ్డి దొరుకుతుంది. మధ్యాహ్నానికి డస్సిపోయి దప్పిక తీర్చమని అర్థించగా రమణులు స్వయంగా దోసిళ్లలో నీళ్లుపోసి, దాహం తీర్చేవారు.
అలాగే అక్కడి నిరుపేదలకు మహర్షి ఏదో విధంగా సాయపడే వారు. విరూపాక్ష గుహలో రమణులు అన్నంలో ఉప్పు, అల్లం కలిపి ఇచ్చేవారు. గంజి సిద్ధం చేసేవారు. వాళ్లు దానిని అమృతం లాగా తాగేవాళ్లు. ఆనందం నిండిన మనసుతో వెనుతిరిగేవారు. చంటిపిల్లలతో కొండపైకి వచ్చే స్త్రీలను చూసి రమణులు కదిలిపోయేవారు. వాళ్లు కట్టెలు కొట్టేటప్పుడు వారి పిల్లల్ని ఎత్తుకుని లాలించేవారు. కాలక్రమంలో రమణులు ఆశ్రమంలో స్థిరపడ్డాక, ఆ శ్రమజీవుల గురించి ప్రస్తావిస్తూ ఉద్విగ్నభరితులయ్యేవారు.
- బి.సైదులు