
ఫీచర్ పేజీలు
విశాఖపట్నంలో గోస్తనీ నదీతీరానున్న పద్మనాభుని గుడి పురాతనమైంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు స్వామిని దర్శించు కోగా, అనంతపద్మనాభ వ్రతం ఆచరించమని స్వామి చెప్పారని పురాణ కథనం. కొండ దిగువన కుంతీమాధవ స్వామి ఆలయం ఉంది. స్థల పురాణాన్ని అనుసరించి కొడుకులు అజ్ఞాతవాసంలో ఉన్నారన్న చింతతో కుంతీదేవి తీర్థయాత్రలకు వెళ్లింది. గోపాలుని విగ్రహాలను ఐదుచోట్ల ప్రతిష్ఠించింది. అవి కాశీలో వేణుమాధవస్వామి, ప్రయాగలో బిందు మాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, పిఠాపురంలో సుందర మాధవుడు. గోస్తనీతీరానికి వచ్చేసరికి కుంతీదేవికి తనపేరు కలుపుకోవాలనే ఆశ కలిగి మేనల్లుణ్ని ప్రార్థించిందట. అయన సరేనన్నాడు. ఆ విధంగా అక్కడ మూలవర్లు కుంతీమాధవులయ్యారు. ఈ స్వామికి రెండు పక్కలా శ్రీదేవి, భూదేవి, కొంచెం దూరంగా చామరం పడుతూ గంధర్వులు, పాదాల దగ్గర గరుడాళ్వారు, ఆంజనేయస్వామి ఉన్నారు. ఎడమ చేతితో మాధవస్వామి అభయం ఇవ్వడం ఇక్కడ విశేషం. అలాగే చక్ర పెరుమాళ్, వేణు గోపాలస్వామి, రుక్మిణీ సత్యభామలు, సత్యనారాయణమూర్తి విగ్రహాలున్నాయి. ఇక్కడికి చేరువలో కృష్ణదేవరాయల కళింగ దిగ్విజయ యాత్రా విజయస్తంభం ఉంది.
ఇక్కడ దీపోత్సవం ప్రసిద్ధం. కొండ మీదికి నిర్మించిన 1285 మెట్లు దీప కాంతులతో మెరిసిపోతాయి. పూర్వం ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. కార్తికమాసం చివరి రోజున మెట్లకు ఇరువైపులా దీపాలంకరణ అప్పటి నుంచి ప్రారంభమైంది. మధ్యలో కొంతకాలం ఈ ఉత్సవం ఆగిపోయింది. తిరిగి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నాగరాజు అనే భక్తుడు ఈ దీపోత్సవాన్ని పునరుద్ధరించగా, 2012 నుంచి దేవస్థానం నిర్వహిస్తోందని స్థానికులు చెబుతారు. ఈ ఉత్సవం చూసేందుకు వేలాదిమంది భక్తులు వస్తారు.
- డి.భారతీదేవి