
ఫీచర్ పేజీలు
నేడు ధన్వంతరీ జయంతి
అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో మొదట హాలాహలం పుట్టింది. తర్వాత కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు ఉద్భవించింది. ఆ వరుసలో ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రం, ఐరావతం అనే ఏనుగు, వాడని పూల తరువు కల్పవృక్షం పాలకడలి నుంచి పుట్టుకొచ్చాయి. ఆనక శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించింది. సకల శుభాలకూ నెలవైన శ్రీలక్ష్మి విష్ణు మూర్తిని వరించింది. అటు పిమ్మట పాలసంద్రం నుంచి అమృత కలశాన్ని చేత ధరించి విష్ణువు అంశ అయిన ధన్వంతరి అనే దివ్యపురుషుడు ఉద్భవించాడు. దీర్ఘ బాహువులతో, శంఖం వంటి కంఠంతో, పీతాంబరాలను, పూలదండను ధరించి, భూషణాలంకృతుడైన ధన్వంతరి వైద్యశాస్త్రానికి అధిదేవత. ఆయుర్వేద వేల్పు. దేవతలకు వైద్యుడు. అందుకే వైద్యులను ధన్వంతరి ప్రతినిధులుగానే భావిస్తూ ‘వైద్యో నారాయణో హరిః’ అని ప్రశంసిస్తాం.
ధన్వంతరి ద్వాపర యుగంలో కాశీరాజైన ధన్వుడికి కొడుకుగా పుట్టాడు. భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకున్నాడు. తండ్రి తర్వాత కాశీరాజు అయ్యాడు. అతడి కొడుకు కేతుమంతుడు. బ్రహ్మాండ పురాణంలో ధన్వంతరి ప్రస్తావన విపులంగా కనిపిస్తుంది. సర్వ రోగాలూ ఉపశమించటానికి మన మహర్షులు..
ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వరోగ నివారణాయత్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీశ్రీశ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా
అంటూ ఉపదేశించిన ధన్వంతరీ మంత్రం ఆరోగ్య మంత్రంగానూ ప్రసిద్ధం. ఇదెంతో మహిమాన్వితమైందని నమ్ముతారు. అందుకే ధన్వంతరి త్రయోదశి నాడు అంటే ఆ దేవతామూర్తి ఆవిర్భవించిన రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజును ‘జాతీయ ఆయుర్వేద దినోత్సవం’గానూ జరుపుతారు.
- ప్రహ్లాద్