
గ్రేటర్ హైదరాబాద్
మంత్రి అజయ్‌కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్, చిత్రంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్
ఈనాడు, హైదరాబాద్: ‘డీజిల్ ధరల భారంతో ఆర్టీసీ ఛార్జీలను కిలోమీటరుకు 25 నుంచి 30 పైసలు పెంచాలనుకుంటున్నాం. ఆ ప్రతిపాదనలను గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపాం. ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఆర్టీసీపై ఇక్కడి రవాణాశాఖ కార్యాలయంలో వీరు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఛార్జీల పెంపుపై సంస్థ ఎండీ సజ్జనార్ సర్వే చేయించారని, కేవలం 4.3 శాతం మందే అభ్యంతరం చెప్పారని తెలిపారు.
‘‘డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీపై భారీ భారాన్ని మోపుతోంది. 2019లో ఛార్జీలు పెంచిన సమయంలో లీటరు డీజిల్ ధర రూ.68.29 ఉండగా ప్రస్తుతం రూ.87.07గా ఉంది. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.10 చొప్పున, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు రూ.15, డీలక్స్‌కు రూ.20, సూపర్ లగ్జరీకి రూ.25, రాజధాని ఏసీ, గరుడ ప్లస్ బస్సులకు రూ.35 చొప్పున ఆదాయం వస్తోంది. గడిచిన మూడేళ్లలో సంస్థకు రూ.4,260 కోట్ల నష్టం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లింది. ఛార్జీలు పెరిగితే ఈ నష్టాలు కొంతైనా తగ్గుతాయి. తుక్కు కింద తొలగించిన బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని అజయ్‌కుమార్, గోవర్ధన్ వెల్లడించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు.
పెంపు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పక్కనపెట్టి, నష్టాల పేరుతో పేదల జేబుకు చిల్లు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. విలువైన ఆర్టీసీ ఆస్తులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి బుధవారం ట్విటర్లో ఆరోపించారు.