
తెలంగాణ
ముగిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
ఫిలింఛాంబర్లో భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు
సిరివెన్నెల పార్ధివదేహంతో మహాప్రస్థానానికి బయలుదేరిన వాహనం
‘‘తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది.. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చినవాడినేది కోరేది!!’’ అని ప్రశ్నించారాయన.
తేనెలొలికే తెలుగు పదాలతో కొండంత భావాన్ని పలికించి.. తీయటి పాటలను పేటికలకొద్దీ అందించిన ఆయన కూడా తెలుగువారికి ఆ ముచ్చటను మూణ్నాళ్లకే ముగించి వెళ్లిపోయారు.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, రాయదుర్గం, ఫిలింనగర్, న్యూస్‌టుడే: బతుకు నేర్పిన పాట నేలకొరిగింది.. భరోసానిచ్చిన మాట మూగబోయింది.. ప్రశ్నించిన గొంతు ఆగిపోయింది.. కనిపించని తీరాలకు తరలిపోయింది.. అది ఇక తిరిగి రాదని తెలిసిన మనసులెన్నో మూగగా విలపించాయి.. ఆ కట్టె కాలిపోతుంటే ఇదంతా అబద్ధమైతే బావుండని అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ రచయిత, పాటల రేడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఫిలింఛాంబర్లో ఉంచారు. కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అభిమానులు బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు సీతారాముడికి ఘనంగా నివాళులర్పించి కుటుంబసభ్యులకు ఓదార్చారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్‌రావు ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని హాజరై సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రులు హరీశ్, తలసాని
అడుగడుగునా నీరాజనం
రాయదుర్గం మహాప్రస్థానంలో సిరివెన్నెలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఫిలింఛాంబర్ నుంచి పద్మాలయ స్టూడియో రోడ్డు, నార్నే రోడ్డు మీదుగా పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానుల నడుమ అంతిమయాత్ర సాగింది. పెద్దకుమారుడు యోగేశ్వర్ తండ్రి చితికి నిప్పంటించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క, గాయకుడు మనో, పలువురు కవులు, సినీ ప్రముఖులు అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అక్కడే ఉన్నారు.
ఎందరికో స్ఫూర్తి: మంత్రి తలసాని
తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ విషాదకరమైన రోజిది. ఆయన ప్రతి పాటా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి.
చైతన్యం రగిలించిన వ్యక్తి: మంత్రి హరీశ్‌రావు
ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తి. ద్వంద్వార్థాలు లేకుండా పాటలు రాసిన మంచి వ్యక్తి. సమాజంలో గొప్ప చైతన్యం రగిలించిన ధీశాలి.
చెరగని ముద్ర: ఏపీ మంత్రి పేర్ని నాని
తెలుగు అక్షరాలు 56. తెలుగు నేర్పిన ప్రతి వాడికీ అవే మూలం. అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి తరఫున ఘన నివాళి అర్పిస్తున్నాం.
సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండ
ఈనాడు, అమరావతి: సిరివెన్నెల సీతారామశాస్త్రి చికిత్సకైన ఖర్చు రూ.27 లక్షలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది. ఇంటి స్థలమూ కేటాయించి, ఆ కుటుంబానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళి
సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరనే విషయం వింటేనే ఎంతో బాధ కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సీతారామశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళుర్పించారు.