
తెలంగాణ
భోజనం చేసేందుకు స్థలం లేక నడిరోడ్డుపై కూర్చుని తింటున్న అమరావతి రైతులు
పొదలకూరు, న్యూస్‌టుడే: అమరావతి రైతుల మహా పాదయాత్ర బుధవారం 31వ రోజు ఉద్రిక్తతలు, భావోద్వేగాల మధ్య సాగింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బసకు, వంటకు స్థలాలిచ్చే వారిపైనా వైకాపా శ్రేణులు ఒత్తిడి తీసుకురావడంతో.. పాదయాత్రలోని మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ‘ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంతూరు తోడేరు సమీపంలోనే అన్నదాతలు రోడ్డుపై భోజనం చేసే పరిస్థితి కల్పించారు. పోలీసులు టాయిలెట్లు పీకేశారు. అత్యవసర పరిస్థితుల్లో చెట్లు, పుట్ల పక్కకు వెళ్లలేక సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అందరిదీ అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు పారుతుండటంతో.. భారీ వాహనాలన్నింటినీ పొదలకూరు-నెల్లూరు రహదారి మీదుగా మళ్లించారు. అదే మార్గంలో రైతులు బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు ఆందోళన విరమించి పాదయాత్ర కొనసాగించారు. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. సుమారు 12 కి.మీ. సాగి, మర్రిపల్లి వద్ద ముగిసింది. మరుపూరు దగ్గర బస చేసేందుకు స్థలం దొరక్కపోవడం, మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయోటాయిలెట్లను పోలీసులు తీసేయించడంతో వారు అవస్థలు పడ్డారు.
తమపై కక్షసాధిస్తున్నారంటూ కన్నీరు పెడుతున్న మహిళా రైతు