
తెలంగాణ
డీజీపీ మహేందర్‌రెడ్డి
తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలోని చెన్నాపురం పోలీసు బేస్క్యాంపుని పరిశీలిస్తున్న డీజీపీ
మహేందర్‌రెడ్డి. పక్కన సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రశ్మీశుక్లా, ఇతర అధికారులు
చర్ల, బూర్గంపాడు, న్యూస్‌టుడే: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. తొలుత హెలికాప్టర్లో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తొంగూడెం పోలీస్ బేస్ క్యాంపునకు వెళ్లారు. అక్కడి నుంచి దట్టమైన అడవుల గుండా 13 కి.మీ.దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం బేస్ క్యాంపునకు వచ్చారు. అక్కడ సుమారు 2 గంటలకు పైగా పరిశీలించి, అధికారులతో చర్చించారు. ఆయన వెంట సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రశ్మీశుక్లా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కొత్తగా నిర్మిస్తున్న చెన్నాపురం బేస్‌క్యాంపునకు వ్యతిరేకంగా ఇటీవల మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆకస్మిక పర్యటన ఆద్యంతం ఉత్కంఠ రేపింది. అడవుల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తిరిగి రహదారి మార్గంలో తొంగూడెం బేస్స్టేషన్కు వెళ్లిన డీజీపీ.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బూర్గంపాడు మండలం సారపాక చేరుకున్నారు. అక్కడ సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీతో పాటు ఐజీ వై.నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీనివాస్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు లేవని.. రాష్ట్ర మావోయిస్టు కమిటీ అంతా ఛత్తీస్‌గఢ్‌లో నివాసం ఉంటోందని వివరించారు. వారు తెలంగాణాకు రాకుండా సరిహద్దు ప్రాంతాల పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.