
గ్రేటర్ హైదరాబాద్
థియేటర్ల దరఖాస్తులను అనుమతించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్లకు అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపు నిమిత్తం థియేటర్ల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలకు సంబంధించిన వివాదం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని.. చివరిసారిగా గడువు ఇస్తున్నామని, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గురువారం విడుదల కానున్న అఖండతోపాటు ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, పుష్ప, రాధేశ్యామ్ సినిమాల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తులను అనుమతించేలా ఆదేశించాలంటూ లలిత, చంద్రకళ, శశికళ తదితర పలు థియేటర్లు హైకోర్టును ఆశ్రయించాయి. అఖండకు ప్లాటినం టికెట్ ధర రూ.100 నుంచి రూ.150లకు, ఆర్ఆర్ఆర్కు రూ.250కి, భీమ్లానాయక్, పుష్ప, రాధేశ్యామ్‌లకు రూ.200లకు పెంచుకోవడానికి అనుమతించాలని దరఖాస్తు చేశాయి. గోల్డ్ టికెట్ ధర రూ.60 నుంచి రూ.100కు పెంచుకునేందుకు, కనీస టికెట్ ధర రూ.50 ఉండేలా అనుమతించాలని కోరాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం 2017లో జీవో నం. 75 జారీ చేసిందని, ఆ తరువాత వారానికే దాని అమలును నిలిపివేసిందన్నారు. దీనిపై గతంలో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా ధరలు పెంచుకోవడానికి అనుమతించిందని చెప్పారు. ఈ దశలో సినీ ప్రేక్షకుల సంఘం తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని న్యాయవాది జి.ఎల్.నరసింహారావు కోరగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇంప్లీడ్ పిటిషన్‌పై తరువాత విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం థియేటర్ల దరఖాస్తులను అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సినీ తారల విరాళాలు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బాధిత కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా సినీ తారలు విరాళాలు ప్రకటించారు. ప్రముఖ కథానాయకులు చిరంజీవి రూ.25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, మహేష్‌బాబు రూ.25 లక్షలు, రామ్‌చరణ్ రూ.25 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.