
గ్రేటర్ హైదరాబాద్
స్థాపనకు ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు
18 జిల్లాల్లో వనరుల గుర్తింపు
ప్రణాళిక రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో ఖనిజాధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లాలవారీగా వనరులపై నివేదిక రూపొందించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించనుంది. తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు ప్రజలకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. దేశంలోని భారీగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతోపాటు దేశంలోని అల్యూమినియం సిలికేట్(క్యానైట్)లో 47 శాతం తెలంగాణలో లభిస్తోంది. 29 శాతం కోరండం, 10 శాతం సున్నపురాయి ఇక్కడే ఉంది. ఇవి కాకుండా బెరైటీస్, డోలమైట్, క్వార్ట్స్్జ, లేటరైట్ వంటి ఖనిజ సంపద రాష్ట్రంలో అపారంగా ఉంది. మరో 95 ఖనిజాలూ ఉన్నాయి. అంతర్జాతీయంగా పేరుగాంచిన నలుపు, గులాబీ, నీలం, రంగురంగుల రకాల గ్రానైట్ లభిస్తోంది. ప్రస్తుతం అనేక ఖనిజాలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. 18 జిల్లాల్లో ఖనిజ వనరులను గుర్తించింది. ఏయే జిల్లాలు ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమో ప్రణాళిక రూపొందించింది. వీటి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనుంది. స్థానికంగా భూములను గుర్తించడంతో పాటు రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఏయే పరిశ్రమలకు అనుకూలం
* ఆదిలాబాద్: సిమెంట్, ఫెర్రో అల్లాయ్
* భద్రాద్రి-కొత్తగూడెం: బొగ్గు, రాగి, సీసం, రోడ్ మెటల్, మార్బుల్, సాధారణ ఇసుక యూనిట్లు, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్, స్పాంజ్-ఐరన్ ప్లాంట్లు
* జయశంకర్: విద్యుత్ కేంద్రాలు, ఫ్లైయాష్ ఇటుకల తయారీ, హైడ్రేటెడ్ లైమ్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్లు
* జగిత్యాల: గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
* జోగులాంబ గద్వాల: క్రషింగ్ యూనిట్లు
* ఖమ్మం: స్పాంజ్ ఐరన్, థర్మల్ ప్లాంట్లు, ఉక్కు కర్మాగారం, గ్రానైట్, క్వార్ట్జ్ యూనిట్లు
* కుమురం భీం: సిరామిక్ పరిశ్రమలు
* మహబూబాబాద్: గ్రానైట్, పాలిషింగ్ యూనిట్లు
* మహబూబ్నగర్: గాజు, స్టోన్ క్రషింగ్ యూనిట్లు
* మంచిర్యాల: విద్యుత్ కేంద్రాలు, సిమెంటు, స్పాంజ్ ఐరన్
* నల్గొండ: యురేనియం శుద్ధి, సిమెంటు, జాగు(జాగ్వార్ స్టోన్), ఫెర్రో సిలికాన్, గ్రానైట్
* పెద్దపల్లి: థర్మల్ విద్యుత్, స్పాంజ్ ఐరన్
* సూర్యాపేట: సిమెంటు తయారీ, సున్నపురాయి శుద్ధి పరిశ్రమలు
* వికారాబాద్: సిమెంటు
* వరంగల్, హనుమకొండ జిల్లాలు: గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
* యాదాద్రి: గ్రానైట్, స్టోన్ క్రషింగ్
- ఈనాడు, హైదరాబాద్