
గ్రేటర్ హైదరాబాద్
తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళులర్పించిన ఈటల
గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఈటల రాజేందర్, ఇతర నాయకులు
నారాయణగూడ, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో నమ్ముకున్న ఉద్యమాన్ని, ప్రజా చైతన్యాన్ని, పౌర హక్కులను ఇప్పుడు కాలరాస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు, ఉద్యమస్ఫూర్తి అనేవే లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిణామాలు గమనిస్తున్నారని, ఆత్మగౌరవం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 12వ వర్ధంతి సందర్భంగా బుధవారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఈటల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరులు భావించిన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక తెలంగాణ సిద్ధించలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్లో రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని స్పష్టం చేశారు. ఆయన వెంట ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శంకర్‌ముదిరాజ్, భాజపా నేతలు డా.సురేఖ, భిష్వా ఓంప్రకాష్ ఉన్నారు.