
తెలంగాణ
కొత్త వేరియంట్‌పై దక్షిణాఫ్రికా వైద్యులు ఇదే విషయం చెప్పారు
ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి
ఈశ్వరీబాయి స్మారక పురస్కార ప్రదానం
డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పురస్కారం అందజేస్తున్న తమిళిసై, పక్కన శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌అలీ, డా.రామచంద్రారెడ్డి, కె.వి.రమణాచారి, గీతారెడ్డి
రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కొవిడ్-19 కారణంగా రెండేళ్లుగా ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి అన్నారు. వారం రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రజల్లో భయం నెలకొందని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా, ఇతర దేశాల్లోని వైద్యులతో దీనిపై చర్చించినప్పుడు ఈ వేరియంట్ అంత తీవ్రంగా లేదని, వైరస్ సోకినవారు 2-3 రోజుల్లోనే కోలుకుంటున్నారని, మరణాలు లేవని చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ వైరస్‌తో టీకా పోరాడుతుందా, లేదా అనేది రెండు వారాల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్(హైదరాబాద్) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కళామందిరంలో జె.ఈశ్వరీబాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌పై కలిసికట్టుగా పోరాడాయి. 120 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాం. అయినా మరో మూడు నెలలు అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ ఆయన సూచించారు. ప్రజలు మేకలు, గొర్రెల్లా కాకుడా.. సింహాల్లా ఉండాలని అంబేడ్కర్ చెప్పిన మాటను ఆచరణలో చూపించిన వీర వనిత జె.ఈశ్వరీబాయి అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ, ట్రస్ట్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.