
తెలంగాణ
ఈనాడు హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనిని అంచనా కంటే ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎం.ఐ.ఇ.ఎల్) దక్కించుకొంది. సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు నిర్మించే లిఫ్టుతోపాటు ప్రధాన కాలువ, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని మొత్తం 8 మండలాల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనికి పిలిచిన టెండర్ ప్రైస్ బిడ్ను సంబంధిత ఇంజినీర్లు బుధవారం తెరిచారు. రూ.1,422 కోట్ల అంచనాతో పిలిచిన ఈ పనికి రెండు కంపెనీలు టెండర్ దాఖలు చేయగా, రెండూ సాంకేతికంగా అర్హత సాధించాయి. ఇద్దరి ప్రైస్బిడ్ తెరవగా రూ.1,487 కోట్లతో పని విలువపై 4.6 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్-1గా రాగా, రూ.1,490 కోట్లతో 4.8 శాతం ఎక్కువకు దాఖలు చేసిన ఎన్.సి.సి సంస్థ ఎల్-2గా వచ్చింది.