
తెలంగాణ
ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం
వారం రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఈనాడు, హైదరాబాద్: రైతుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కోతులు, అడవి పందుల బెడద నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోతుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యల్ని సూచించేందుకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. కోతులతో తలెత్తుతున్న సమస్యలు, అడవి పందుల బెడదను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్లో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, వ్యవసాయ, వెటర్నరీ వర్సిటీల వీసీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. కోతుల సంఖ్య తగ్గించడం, నియంత్రించడానికి రాష్ట్రంలో మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ పంటల్ని కోతుల నుంచి కాపాడుకునేందుకు పలు సంప్రదాయ విధానాలపై రైతులను చైతన్యపరచాలని అనుకున్నారు.