
తెలంగాణ
తాజా ధర రూ.2,278
ఈనాడు, హైదరాబాద్: వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల వంట గ్యాస్ సిలిండరు ధరను వరుసగా రెండో నెలా కేంద్రం భారీగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, వంటగ్యాస్ ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తేదీన కేంద్ర చమురు సంస్థలు ధరలను ప్రకటిస్తాయి. అందులో భాగంగా బుధవారం నుంచి నూతన ధరలను అవి ప్రకటించాయి. తాజాగా సిలిండరు ధర రూ.2,278కి చేరింది. గత నెలతో పోలిస్తే రూ.103 పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సిలిండరు ధరపై రూ.798 పెరిగినట్లయింది. 2014 తరవాత సిలిండరు ధర రూ.2000 దాటటం ఇది రెండోసారి. వాణిజ్యావసరాలకు వాడే ఈ బండపై బాదుడు హోటళ్లతో పాటు రోడ్డు వెంట విక్రయించే ఆహార పదార్థాల ధరలను ప్రభావితం చేయనుంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండరు ధరలో ఎలాంటి మార్పూ లేదు.